Telangana Government Released White Paper : ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామని తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి ( Chief Minister )రేవంత్ రెడ్డి ( Revanth Reddy) తెలిపారు. పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్న రేవంత్ రెడ్డి, శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి, అవమానించడానికో కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఆరు గ్యారంటీ ( Six Guarantees )లను ఎగ్గొట్టడానికి కానే కాదన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం రిలీజ్ చేశామన్నారు. ఈ నివేదిక ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చారని, ప్రతిపక్షాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోవాలని సూచించారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.


స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసమే తాము ఆలోచిస్తున్నామన్నా సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్న ఆయన, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద వివరాలు తీసుకున్నామన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద తెలంగాణ నిధులు సగటున 303 రోజులకు సరిపడా ఉండేవన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక...సగటున లెక్కలు వేసుకున్నా సగం రోజులు కూడా లేవన్నారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్ రెడ్డి. అర్హులైన వారికి సంక్షేమం అందించి, దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 


కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం నీటితోనే ఏటా 5వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని సభకు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి, అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలంటూ కాగ్ మొటికాయలు వేసిందన్నారు. మిషన్ భగీరథతో 5,700 కోట్లు సంపాదిస్తామని, బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి రుణాలు తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథతో 10వేల కోట్లు వసూలు చేస్తామని నివేదికలు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లతో కట్టామనడం అబద్దన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్పా, ఎవరు సాగునీటి పారుదల శాఖకు మంత్రులుగా పని చేయలేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,448 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అడ్డుగోలుగా అప్పులు తెచ్చింది కాకుండా...ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారని అన్నారు. అవాస్తవాలతో హరీశ్ రావుసభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.