Congress Mukt Bharat: 


అంత సులభం కాదు..


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)అధ్యక్షుడు శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన  హాజరయ్యారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహా వికాస్ అఘాడీ కూటమి నేతల గురించి ప్రస్తావిస్తూనే బీజేపీని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తోందనడానికి ఎన్‌సీపీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్, శివసేనకు చెందిన సంజయ్‌రౌత్‌లే సాక్ష్యమని మండి పడ్డారు పవార్. ఈ సమయంలోనే కాంగ్రెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ ముక్త్ భారత్ ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ పార్టీ దేశానికి అందించిన సేవల్ని, ఆ చరిత్రను ఎవ్వరూ మర్చిపోలేరు" అని వెల్లడించారు. కాంగ్రెస్ భవన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఆయన పుణెలోని కాంగ్రెస్ కార్యాలయానికి ఉన్న
చరిత్రనూ ప్రస్తావించారు. "ఎన్నో చారిత్రక ఘటనలకు ఇదే సాక్ష్యం. కాంగ్రెస్‌లో అగ్రనేతలైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఈ కార్యాలయానికి వచ్చారు. అప్పట్లో ఈ రాష్ట్రానికి ఇదే హెడ్‌ ఆఫీస్‌గా ఉండేది" అని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను ఊహించుకోలేమని స్పష్టం చేశారు. "కొందరు కావాలనే కాంగ్రెస్‌ను తక్కువ చేస్తున్నారు. ఈ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించేది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీ ఐడియాలజీని అంత సులభంగా మర్చిపోలేం" అని అన్నారు. ఐడియాలజీలో సారూప్యత ఉన్న పార్టీలన్న ఏకమై తప్పకుండా "కాంగ్రెస్ ముక్త భారత్" అనే ఆలోచనకు అడ్డుకట్ట వేస్తామని వ్యాఖ్యానించారు. 


సార్వత్రిక ఎన్నికలపైనా కామెంట్స్..


2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ బలమైన కూటమిని ఏర్పాటు చేస్తాయని పవార్ అన్నారు. ఇందుకోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 


" జాతి ప్రయోజనాల కోసం బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బంగాల్‌ ఎన్నికల నాటి సంఘటనలను విస్మరించాలని ఆమె అనుకుంటున్నారు. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్‌, సీపీఎం నేతృత్వంలోని కూటమి ఉపయోగపడిందని మమత భావిస్తున్నారు. అయితే అవేవీ పట్టించుకోకూడదని మమత అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లేందుకు చాలా పార్టీలు సుముఖంగా ఉన్నాయి.                                                              "
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత


మరోవైపు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్నారని పవార్ అన్నారు. 


" భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవడానికి విపక్షాలు అంతా సిద్ధంగా ఉన్నాయి.                                               "
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత


Also Read: Ashneer Grover on Uber Cabs: అంతరిక్షంలోనూ ట్రిప్స్‌ వేసిన ఉబెర్‌ కార్లు, నెఫ్ట్యూన్‌ గ్రహం వరకు టూర్లు! ఒక్క ట్వీట్‌తో వెనక్కి వచ్చాయి