బర్త్ సర్టిఫికెట్ నుంచి డిగ్రీసర్టిఫికెట్ వరకు అన్నింట్లో పుట్టుమచ్చల కోసం ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. అక్కడ శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో రాయాలి. పుట్టు మచ్చలకు అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా పుట్టు మచ్చలు అసలెందుకు ఏర్పడతాయి? అవి ఏర్పడకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టేనా?
పుట్టుకతో వస్తాయా?
పుట్టుమచ్చలు పుట్టుకతో రావాలని లేదు. ఒకట్రెండు పుట్టుకవతో రావచ్చు, రాకపోనూ వచ్చు. పుట్టిన కొన్ని రోజులు లేదా కొన్ని నెలల తరువాత అవి మెల్లగా బయటపడతాయి. కొంతమంది పిల్లల్లో రెండు మూడేళ్ల తరువాత వచ్చే అవకాశం కూడా ఉంది. పుట్టు మచ్చలు కనిపించకపోతే అదేదో ఆరోగ్య సమస్యేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. దాదాపు పదిశాతం మంది పిల్లలు పుట్టుకతోనే పుట్టుమచ్చతో పుడతారు. ఆ పుట్టుమచ్చలను హెమంగియోమా అంటారు. అవి శాశ్వతంగా ఉండాలని లేదు. పదేళ్ల వయసు దాటాకా మాయమైపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టు మచ్చలు ఎప్పుడైనా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది.
ఎలా ఏర్పడతాయి?
పుట్టుమచ్చలు రెండు రకాలు. కొన్ని రక్తనాళాలు సరిగా ఏర్పడకుండా, ఒకదానికొకటి దగ్గరగా ఏర్పడి, అక్కడ రక్తకణాలు పేరుకుపోయినప్పుడు కొన్నిసార్లు పుట్టుమచ్చలా ఏర్పడతాయి. ఇవి నలుపుగా కాకుండా, పేలవమైన రంగులో ఉంటాయి. వీటిని వాస్కులర్ పుట్టుమచ్చలు అంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఇలా వాస్కులర్ పుట్టుమచ్చులతో పుడతారు. ఇక రెండోది పిగ్మెంటెడ్ పుట్టుమచ్చలు. అంటే శరీరంలో ఏదైనా ప్రదేశంలో వర్ణద్రవ్యం కణాలు అధికంగా పేరుకుపోతే అక్కడ నల్లటి మచ్చలా మారుతుంది. ఇవే అధికంగా అందరికీ ఉండే పుట్టుమచ్చలు.
వారసత్వంగా...
కొన్ని పుట్టుమచ్చలు కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. తల్లికి లేదా తండ్రికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందో, పిల్లలకు అక్కడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగని అందరికీ రావాలని లేదు. కొన్ని కుటుంబాల్లోనే ఇలా జరిగే అవకాశం ఉంది.
ఎన్నో కథలు..
పిల్లలకు పుట్టుమచ్చలు వచ్చే విషయంలో కొన్ని కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గర్భధారణ సమయంలో తల్లి తీవ్ర భావోద్వేగానికి గురై, తన శరీరంలోని ఒక ప్రదేశాన్ని తాకినట్టు అయితే, బిడ్డకు ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ వచ్చే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ అది కేవలం అపోహే అనే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
Also read: పొడవుగా ఉన్న వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.