Congress AAP Seat Sharing: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు లెక్కలు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. విశ్వసీయ వర్గాల సమాచారం ప్రకారం...ఢిల్లీలో ఆప్‌ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేస్తాయని ఇప్పటికే తెలిసింది. అయితే...దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మైత్రిని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి. ఆప్‌తో డీల్ కుదిరిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మరి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితేంటన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని, ఆ పార్టీ తమతో కలిసి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేయాలనుకున్న వారిలో మమతా బెనర్జీ కూడా ఒకరని, పొత్తుల విషయంలో చర్చలకు సిద్ధంగానే ఉన్నాని వెల్లడించారు. 


"I.N.D.I.A కూటమిని బలోపేతం చేయాలనుకుంటున్నట్టు గతంలోనే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌ లక్ష్యం అదే అన్నారు. బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. రెండు పార్టీల మధ్య విభేదాలు రావడం చాలా సహజం. కానీ ఇప్పటికీ మాకు మమతా బెనర్జీపై గౌరవముంది"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


పొత్తుల విషయంపైనా మాట్లాడారు జైరాం రమేశ్. ఇప్పటికే యూపీలో సీట్‌ల పంపకాలపై అధికారికంగా ప్రకటన చేసినట్టు వెల్లడించారు. ఆప్‌తో కలిసి ఇదే విధంగా అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 


"యూపీలో కూటమి విషయంలో ఇప్పటికే ఓ స్పష్టతనిచ్చాం. కాకపోతే కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ పొత్తుల విషయంలోనూ క్లారిటీ ఇస్తాం. కాంగ్రెస్ కావాలనే నాన్చుతోందని చాలా మంది విమర్శలు చేశారు. కానీ...కచ్చితంగా సమయం పడుతుంది"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


మహారాష్ట్రపైనా కాంగ్రెస్ ఫోకస్


లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పొత్తుల విషయంలో క్లారిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటికే యూపీలో లెక్కలు తేల్చింది. అటు పంజాబ్, ఢిల్లీ, హరియాణాలోనూ దాదాపు స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రపై ఫోకస్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే శివసేన (UBT)తో పాటు శరద్ పవార్‌ NCPతో పొత్తు లెక్కలు మాట్లాడుతోంది. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో దాదాపు 39 చోట్ల కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మిగతా 9 సీట్ల విషయంలో మాత్రం ఇంతా చర్చలు కొనసాగుతున్నాయి. ముంబయిలోని రెండు కీలక నియోజకవర్గాల విషయంలో కాంగ్రెస్, UBT మధ్య కాస్త పట్టుదలగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఆ సీట్‌లను వదులుకోడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అటు Vanchit Bahujan Aghadi చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ ఐదు సీట్‌లు కావాలని కాంగ్రెస్‌ని డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: ఫ్లైట్‌లో పని చేయని ఏసీ, 5 గంటల పాటు ప్రయాణికుల నరకయాతన - ఊపిరాడక ఇబ్బందులు