రైలు బోగీలు రకరకాల రంగుల్లో ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఒకప్పుడు మన దేశంలోని రైలు బోగీలు ముదురు ఎరుపు(ఇటుక రంగు)లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం అన్నీ రైళ్లు దాదాపు నీలం రంగులో ఉంటున్నాయి. కొన్ని రెడ్, గ్రీన్ కలర్‌లో కూడా ఉంటున్నాయి. మరి రైల్వే బోగీలను రంగులను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా? అయితే, తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవల్సిందే.
ఇండియాలో 1990 వరకు బోగీలన్నీ ఇటుక రంగులోనే ఉండేవి. ఆ తర్వాత బోగీల్లో మార్పులు తీసుకురావడం మొదలుపెట్టారు. చాలా బోగీలను నీలం రంగులోకి మార్చారు. అయితే, దీని వెనుక కొన్ని టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి. పాత రైలు బోగీలకు, కొత్తగా తయారు చేసిన బోగీల బ్రేక్ సిస్టమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. దీనివల్ల రైళ్లకు బోగీలను అమర్చేప్పుడు గందరగోళంగా ఉండేది. పాత బోగీలకు కొత్త బోగీలు అమర్చడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు తలెత్తేవి. ఈ నేపథ్యంలో పాత బోగీలను, కొత్త బోగీలను తేలికగా గుర్తుపట్టేందుకు రంగులు మార్చడం ఒక్కటే మార్గమని భావించారు. ఈ నేపథ్యంలో కొత్త బోగీలకు నీలం రంగు వేయడం మొదలుపెట్టారు.
రైళ్లను ఎక్కువగా స్టీల్-ఐరన్ కాంబినేషన్‌తో తయారు చేస్తారు. దీనివల్ల బోగీలు ఎన్నాళ్లయినా తుప్పు పట్టవు. బోగీల తయారీ తర్వాత రెడ్ ఆక్సైడ్ ప్రైమర్ వేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఫెర్రస్ ఆక్సైడ్‌తో తయారు చేసే ఈ ప్రైమర్.. ఇటుక రంగులో ఉంటుంది. ఇనుప వస్తువులకు రంగులు వేసే ముందు ఈ ప్రైమర్‌నే ఉపయోగిస్తారు. అందుకే అప్పట్లో రైళ్ల బోగీలన్నీ ముదురు ఎరుపు ఇటుక రంగులో ఉండేవి. బోగీలన్నింటికీ రంగులు వేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొత్త బోగీలకు, పాత బోగీలకు వేగాన్ని తట్టుకోవడంలో తేడాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) రకానికి చెందిన కోచ్‌లకు నీలం రంగులు వేసేవారు.
⦿ ICF బోగీలు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
⦿ ICF బోగీలను ఎక్కువగా మెయిల్ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు మాత్రమే ఉపయోగిస్తారు.
⦿ ICFలో ఎర్ర రంగు ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి. వీటిని ‘రాజధాని’ ఎక్స్‌ప్రెస్‌కు ఉపయోగిస్తారు.
⦿ ప్రస్తుతం వీటిని ICF బోగీలను లింకే హాఫ్మన్ బుష్(LHB)కు అప్‌గ్రేడ్ చేశారు. వీటి బాడీని అల్యూమినియంతో తయారు చేస్తారు.
⦿ ICF బోగీలతో పోల్చితే LHB బోగీలు మరింత తేలిగ్గా ఉంటాయి. వేగాన్ని కూడా తట్టుకుంటాయి.
⦿ పచ్చ రంగులో ఉండే బోగీలను గరీబ్ రథ్‌కు ఉపయోగిస్తున్నారు.
⦿ ‘లైట్ బ్లూ’ కలర్ బోగీలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు వాడుతున్నారు.
⦿ హంసఫర్ రైళ్లకు ‘ట్రూ డిజిటల్ బ్లూ’ కలర్‌ను ఉపయోగిస్తున్నారు.
⦿ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తెలుపు, నీలం రంగు గీతలు ఉంటాయి.
⦿ కింద నీలం రంగు, పైన పసుపు రంగు ఉండే కోచ్‌లు ‘శతాబ్ది’ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి.
⦿ పసుపు, ఆరెంజ్ రంగు డిజైన్లలో ఉండే కోచ్‌లు ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి.
⦿ ఎరుపు, పసుపు రంగులను కేవలం ‘డబుల్ డెక్కర్’, ‘అంత్యోదయ’ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తారు.
⦿ మహామన ఎక్స్‌ప్రెస్.. ఊదా రంగులో ఉంటుంది.
⦿ LHB గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌కు నీలం రంగులో ఉండి, పసుపు గీత ఉంటుంది. ఆ రైలు గంటకు 155 కిమీల కంటే వేగంగా ప్రయాణిస్తుందని ఆ గీత సూచిస్తుంది.
రైలు బోగీలపై ఉండే ఆ గీతలు ఎందుకంటే..: రైలు రంగులే కాదు, వాటిపై ఉండే గీతల్లో కూడా ప్రయాణికులకు అవసరమైన సమాచారం ఉంటుంది. ఈ సారి మీరు రైలు ఎక్కేప్పుడు వాటిని బాగా గమనించండి.
⦿ రైలు బోగీ చివరన పసుపు గీతలు క్రాస్‌గా ఉంటే.. అది జనరల్ కోచ్ అని అర్థం. ఆ బోగీ ఎక్కేందుకు రిజర్వేషన్ అక్కర్లేదు.
⦿ నీలం రంగు బోగీపై తెలుపు లేదా, లేత నీలం రంగు గీతలు ఉంటే అది స్లీపర్ క్లాస్.
⦿ బోగీపై పసుపు చారలు ఉన్నట్లయితే అది అంగవైకల్యం, అనారోగ్యంతో బాధపడేవారికి కేటాయించిన కోచ్ అని అర్థం.
⦿ లోకల్ రైళ్లలో ఆకుపచ్చ రంగు గీతలుంటే అది మహిళల కోచ్ అని అర్థం.
⦿ లోకల్ రైళ్లలో ఎరుపు గీతలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం.
త్వరలో రంగు రంగుల బోగీలు: దేశంలో అత్యధిక రైళ్లు నీలం రంగులోనే ఉన్నాయి. ఆ రంగును చూసి చూసి బోరు కొట్టినట్లయితే.. త్వరలోనే భిన్నమైన రంగుల్లో బోగీలు కనువిందు చేయనున్నాయి. ఉత్తర రైల్వేలో ఇప్పటికే ఏడు భిన్నమైన రంగుల బోగీలను ప్రయోగాత్మకంగా సిద్ధం చేశారు. బోగీలకు గీతలు ఏర్పడకుండా యాంటీ-గ్రాఫిటీ వినైల్ ఉపయోగించనున్నారు. దీనివల్ల బోగీలు కూడా శుభ్రంగా ఉంటాయి.