నటుడు సిద్ధార్థ్ రెండేళ్లక్రితం తమిళంలో 'సివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై' అనే సినిమాలో నటించారు. ఇందులో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మరో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను 'ఒరేయ్ బామ్మర్ది' పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ : 

 

బైక్ రేసులంటూ అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడు మదన్(జీవీ ప్రకాష్). చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో తన అక్క రాజ్యలక్ష్మి(లిజోమోల్ జోస్)నే జీవితంగా బతుకుతుంటాడు మదన్. ఆమెకి కూడా తమ్ముడు అంటే ప్రాణం. ఇదిలా ఉండగా.. మదన్ ఒకరోజు బైక్ రేస్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ (సిద్ధార్థ్)కి దొరికిపోతాడు. ఆ సమయంలో రాజశేఖర్.. మదన్ కి ఆడవాళ్ల నైటీ వేయించి అవమానిస్తాడు. దీంతో మదన్ అతడిపై పగ పెంచుకుంటాడు. రాజశేఖర్ పై తన కసి తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఇంతలో తన అక్కకి రాజశేఖర్ ఫ్యామిలీ నుండి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. తమ్ముడికి ఇష్టం లేకపోయినా రాజశేఖర్ ని పెళ్లి చేసుకుంటుంది రాజ్యలక్ష్మి. దీంతో అక్కపై కూడా కోపం పెంచుకుంటాడు. ఇంతలో చేయని కేసులో ఇరుక్కుంటాడు మదన్. ఆ కేసు నుండి అతడిని బయటపడేయాలని రాజశేఖర్ ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

 

విశ్లేషణ : 

 

ఎమోషనల్ సినిమాలు తీయడంలో దర్శకుడు శశికి మంచి అనుభవం ఉంది. గతంలో 'బిచ్చగాడు' సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ చూపించిన శశి ఈసారి అక్క-తమ్ముడు, బావ-బామ్మరిది సెంటిమెంట్ తో కథను రాసుకున్నాడు. ముందుగా మదన్, రాజ్యలక్ష్మిల బాల్యం, వారిమధ్య అనుబంధాన్ని చూపిస్తూ కథలోకి తీసుకెళ్లారు. ఆ తరువాత మదన్ రేసింగ్, రాజశేఖర్ కి పట్టుబడే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాజశేఖర్ పై పగ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్న మదన్ ఇంటికి అతడు పెళ్లి చూపులకు వచ్చే సీన్ మరో హైలైట్. పైగా పెళ్లికి కూడా ఓకే చెప్పడంతో మదన్ కోపం మరింత ఎక్కువవుతుంది. 

 

పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మదన్ చేసే ప్రయత్నాలు, వాటిని రాజశేఖర్ తిప్పి కొట్టే సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. రాజశేఖర్-రాజ్యలక్ష్మిల పెళ్లితో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఆసక్తిగా సాగిన సినిమా సెకండ్ హాఫ్ చాలా బోర్ కొట్టిస్తుంది. మదన్ కేసులో ఇరుక్కోవడం, రాజశేఖర్ ఓ డ్రగ్ డీలర్ ని పట్టుకోవాలని తిరగడం ఇదంతా కూడా కథ గాడితప్పినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండు ట్రాక్ లు కూడా పేలవంగా సాగుతాయి. మధ్యలో మదన్ లవ్ స్టోరీ ఒకటి. అసలు హీరోయిన్ ఎందుకు వస్తుందో.. ఎందుకు వెళ్తుందో అర్ధం కాదు. క్లైమాక్స్ సీన్స్ కొంతలో కొంత నయం. 

 

నటన పరంగా చూసుకుంటే సిద్ధార్థ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో అలరించాడు. ఆవేశపరుడైన యువకుడిగా జీవీ ప్రకాష్ నటన మెప్పిస్తుంది. సిద్ధార్థ్-జీవీ ప్రకాష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తమ్ముడిని అమితంగా ప్రేమించే అక్క పాత్రలో లిజోమోల్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించింది. క‌శ్మిరా, మ‌ధుసూధ‌న్ పాత్రలను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. పాటలు, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ గా మారాయి.