భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ దేశభక్తిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట రూపంలో తన దేశభక్తిని చాటుకున్నారు. ‘ఈ దేశం మనందరిదీ’ అంటూ ఓ పాట రాశారు. ఈ పాటను దీదీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగాలీ గాయకులు ఇంద్రనీల్ సేన్, మనోమయ్ భట్టాచార్య, త్రిష పరూయి, దేవజ్యోతి ఘోష్ లు ఈ పాటను ఆలపించారని ఆమె తెలిపారు.
దుష్టశక్తులపై కలిసి పోరాడుదాం
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను ఈ దేశభక్తి గీతాన్ని రాశానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున దేశ ప్రజల ఆలోచనలతో తాను ఈ పాటను రూపొందించానని తెలిపారు. మన స్వాతంత్ర్యాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించే అన్ని దుష్ట శక్తులపై కలిసి పోరాడాలని మమతా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోల్ కతా లోని విక్టోరియా మెమోరియల్ ను 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 7 వేల 500 చదరపు అడుగుల త్రివర్ణ పతాకంతో ముస్తాబు చేశారు. ఆ జెండాను బెంగాల్ గవర్నర్ ఆవిష్కరించారు. హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఈ భారీ తివర్ణ పతాకాన్ని రూపొందించింది.
దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి అన్ని ప్రాంతాలు కలుపుపోవాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతో కూడిన హిమాలయ ప్రాంతం, తీర, గిరిజన ప్రాంతాల అభివృద్ధే దేశ భవిష్యత్తని ప్రధాని అన్నారు. గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్న ప్రధాని, గత ఐదేళ్లలో అనేక గ్రామాలకు రోడ్లు, విద్యుత్తు సదుపాయాలను విస్తరించామని తెలిపారు. ఆప్టికల్ నెట్‌వర్క్ ద్వారా గ్రామాలను సాంకేతికంగా అభివృద్ధి చేశామన్నారు. గ్రామాల్లోనూ డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్న ప్రధాని.... ఇవి యువపారిశ్రామికవేత్తలు పుట్టుకకు నాంది అవుతున్నాయన్నారు.