Independence Day 2021: సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్టైక్స్‌తో వారికి హెచ్చరికలు పంపాం... ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్
ఈ ఏడాది ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు.
భారత్ ఇప్పుడూ పూర్తిగా మారిపోయిందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానికి దాడులతో భారత్ అంటే ఏంటో శత్రు దేశాలకు తెలిసేలా చేశాం. భారత్ ఇకనుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని వారికి ఇప్పటికే అర్థమై ఉంటుదన్నారు మోదీ.
సంక్షేమ పథకాలు అర్హులకు తప్పకుండా అందాలి. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని వచ్చే రెండేళ్లలో అందిస్తాం. పేదవారికి పోషకాహార లోపం ఉంటుంది. కనుక రేషన్ దుకాణాలలో వీరికి పోషకాహార ధాన్యాలు అందించే దిశగా అడుగులు వేస్తాం. వైద్య సదుపాయాన్ని సైతం అందించడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఎర్రకోటలో మోదీ పేర్కొన్నారు. బాలికలు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని, వారికి చేయూత అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో ప్రతి విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది. ప్రస్తుతం చాలా మార్పులొచ్చాయి. గత ఏడేళ్ల కాలంలో ప్రజలకు అనవసరమైన చట్టాలు, పద్ధతులు, విధానాలపై చర్యలు తీసుకున్నాం. అనవసర చట్టాలను రద్దు చేసినట్లు తన ప్రసంగంలో ప్రధాని మోదీ గుర్తుచేశారు.
దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయల కల్పనకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం రూ.100 లక్షల కోట్ల నిధిని సమకూర్చుకునేందుకు పీఎం గటి శక్తి ప్లాన్ అమలు చేయనున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. 75 వందే భారత్ రైళ్లు దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతాయని.. 75 వారాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇది సుసాధ్యం చేస్తామన్నారు.
గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు దేశంలో అన్ని గ్రామాలకు అందుబాటులోకి తెస్తున్నాం. మరికొన్ని రోజుల్లో గ్రామాలకు ఇంటర్ నెట్ సౌకర్యం సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. రైతులు దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు అందించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఛోటా కిసాన్ బనే దేశ్ కి షాన్ అని మోదీ వ్యాఖ్యానించారు. సన్నకారు రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 70కి పైగా కిసాన్ రైళ్లు ప్రారంభించామని గుర్తుచేశారు.
దళితులు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారు, జనరల్ కేటగిరీలోని పేదవారికి న్యాయం చేసేందుకు రిజర్వేషన్లపై పునరాలోచిస్తున్నాం. ఇటీవల ఓబీసీ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రాలు తమ ఓబీసీ జాబితా సిద్ధం చేసుకునే అవకాశాన్ని కల్పించామని తన ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రతి ప్రాంతం అభివృద్ధికి నోచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్ముకాశ్మీర్, లఢాఖ్ లాంటి ప్రాంతాలు సైతం దేశ అభివృద్ధికి పునాదులుగా మారుతాయని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఇదివరకే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు వేయనున్నామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల విలువ పేదవారికి మాత్రమే తెలుసు. గత ఏడేళ్లలో ఉజ్జ్వల నుంచి ఆయుష్మాన్ వరకు అనేక పథకాలను పేద వారికి అందేలా చేశాం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేసింది. ఇదే తీరుగా మరిన్ని సంక్షేమ పథకాలకు పేదలకు అందిస్తాం.
ఇప్పటివరకూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. మన నినాదంగా ముందుకు సాగాం. కానీ వీటితో పాటు సబ్‌కా ప్రయాస్ సైతం మన నినాదంలో చేరితేనే ప్రయోజనం ఉంటుంది. కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదు.. బాధ్యత గల పౌరులుగా నిరంతరం శ్రమ, పట్టుదలతో ఉంటే అన్నీ సాకారమవుతాయని మోదీ అన్నారు. మరో 25 ఏళ్లు.. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచంలోనే మెరుగైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ నిర్వహించిందని గర్వంగా చెబుతున్నాను. 54 కోట్లకు పైగా ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు తీసుకున్నారు. దేశ ప్రజలు ఎంతో ఓపికగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. దీని ఫలితంగా శాస్త్రవేత్తలు, పరిశ్రమల విషయంలో భారత్ పటిష్టంగా తయారైంది. ఇతర దేశాలు భారత్ పై ఆధారపడుతున్నాయి.
భారతదేశాన్ని నియంతృత్వంగా పాలించిన బ్రిటీషువారు మత ప్రాతిపదిక దేశాన్ని రెండు ముక్కలు చేశారు. స్వాతంత్ర్య ఆకాంక్ష నేరవేరే కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలైంది. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఆ విభజన గాయాలకు గుర్తుగా.. ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి 'విభజన భయానకాల స్మారక దినం'గా ప్రధాని మోదీ ప్రకటించారు.
క్రీడాకారులు, అథ్లెట్స్ భారతదేశం గర్వించేలా చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల విజయానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. వారు గెలించింది కేవలం పతకాలు మాత్రమే కాదు, కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలించారని టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు.
ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు, వైద్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా మహమ్మారిపై వైద్య సిబ్బంది చేసిన పోరాటం అసమానం. వారి సేవల్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. దేశాన్ని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడిన నిజమైన హీరోలు వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు అని ప్రధాని మోదీ కొనియాడారు.
కరోనా కష్టకాలంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు దేశానికి ఎంతగానో సేవ చేశారు. ప్రతిక్షణం వారు పౌరుల కోసం ఎంతగానో శ్రమించారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాత్రిపగలూ అనే తేడా లేకుండా డాక్టర్లు, నర్సులు తమ సేవల్ని అందించారు. తద్వారా దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మీకు కొత్త శక్తిని అందిస్తుందని ఆశిస్తున్నాను. ఏడాదిపాటు 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభించారు.
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఎర్రకోటలో సైనిక వందనం స్వీకరించారు. ఏడున్నర గంటలకు ప్రధాని మోదీ జాతీయ పతకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వద్ద దాదాపు 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్‌ఎస్‌జీ, స్వాత్ కమాండోలు..కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహరా కాస్తున్నారు.
కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది అతికొద్ది మందికి మాత్రమే వేడుకలకు ఆహ్వానాలు అందాయి. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఉదయం 7:05 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ చేరుకున్నారు. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతీ ఆశ్రమంలో ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభించారు. ఆగస్టు 15, 2023 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారిని ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మీరాబాయి చాను, నీరజ్ చోప్రా, పీవీ సింధు, భజ్‌రంగ్ పునియా సహా ఒలింపిక్ పతక విజేతలు ఎర్రకోటకు చేరుకుంటున్నారు.
Background
75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకన్ని ఎగురవేయడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ పతక విజేతలను ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -