Delhi Excise Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ.15 వేల బాండ్‌ ఇవ్వాలని ఆదేశించింది. సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ సరిగా స్పందించలేదని ఈడీ తీవ్ర అసనహం వ్యక్తం చేసింది. దీంతో పాటు రూ.లక్ష సెక్యూరిటీ బాండ్‌ కూడా ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈడీ సమన్ల కేసులో ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ సంస్థ కేజ్రీవాల్‌కు చాలా సార్లు సమన్లు జారీ చేసింది. అయితే..కేజ్రీవాల్ ప్రతిసారీ ఏదో ఓ కారణం చూపించి విచారణకు హాజరు కాకుండా దాటవేస్తూ వచ్చారు. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్‌కి సమన్లు జారీ చేసింది. 8 సార్లు ఈడీ పంపిన సమన్లని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  IPCలోని సెక్షన్ 174ని కేజ్రీవాల్ ఉల్లంఘించినట్టు తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ కేసు విచారణ ఉన్నప్పటికీ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాల్సిన అవసరం లేదు. 






ఇప్పటి వరకూ ఏం జరిగింది..?


ఇప్పటి వరకూ అరవింద్ కేజ్రీవాల్‌కి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసింది. వీటన్నింటినీ ఆయన తిరస్కరించారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన గత నెలలో ఈడీ కోర్టులో కంప్లెయింట్ ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌ని ఆదేశించింది. కానీ...సరిగ్గా అదే సమయంలో ఆయన అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు. అందుకే విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు. కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. మార్చి 4వ తేదీన హాజరు కావాలని తేల్చి చెప్పింది. కానీ...మార్చి 12 తరవాతే తాను విచారణకు సహకరిస్తానని, అది కూడా వర్చువల్‌గా హాజరవుతానని చెప్పారు కేజ్రీవాల్. ఫలితంగా మరోసారి కోర్టుని ఆశ్రయించింది ఈడీ. మార్చి 16న వ్యక్తిగతంగా వచ్చి విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను కేజ్రీవాల్ పాటించారు. ఈడీ సమన్ల కేసులను ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారించిన కోర్టు...రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది.