Avantika Vandanapu: ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే హాలీవుడ్ కలలు కనేవారు. ఆ కలలను నిజం చేసుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటిది టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయిన ఒక అమ్మాయి.. ఇప్పుడు హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సిరీస్, సినిమాలతో బిజీ అయిన అవంతిక.. మొదటిసారి తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యింది. కొన్నాళ్ల క్రితం మొదటిసారి ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.


అయిదేళ్లలో అనుకున్నది జరిగింది..


‘ప్రేమమ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది అవంతిక. కానీ ఇతర చైల్డ్ ఆర్టిస్టులలాగా తనకు టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు ఏమీ దక్కలేదు. దీంతో ‘బ్రహ్మోత్సవం’ విడుదల అవ్వగానే అమెరికాకు వెళ్లిపోయింది. 2017లో తను అమెరికాకు వెళ్లిన విషయాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది అవంతిక. ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేయొచ్చు, హీరోయిన్‌గా చేయొచ్చు. కానీ మధ్యలో మాత్రం చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ సమయంలో ఖాళీగా ఉండడం తట్టుకోలేక అమెరికాకు వెళ్లిపోయా. 5 ఏళ్లలో హాలీవుడ్‌లో ఒక కెరీర్ ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు అదే జరుగుతుంది’’ అంటూ అసలు అమెరికాకు వెళ్లిన కారణాన్ని బయటపెట్టింది అవంతిక.


అదే నా లక్ష్యం..


‘‘ఇప్పుడు నాకు మళ్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ అన్నింటిలో కాలుపెట్టాలి, అన్నింటిలో ఒక కెరీర్ ఉండాలి అన్నదే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చింది అవంతిక. తన కాన్ఫిడెన్స్ చూసి చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయిదేళ్లలో హాలీవుడ్‌లో కెరీర్ ఏర్పడాలని లక్ష్యంగా పెట్టుకొని అది సాధించి చూపించిందని ప్రశంసిస్తున్నారు. ఇక తను ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటూ అక్కడే కాలేజ్‌లో చదువుతున్నానని తెలిపింది. తను పుట్టి, పెరిగింది అమెరికాలోనే అని, తనకు పదేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చామని చెప్పింది. కానీ తన కుటుంబం అంతా హైదరాబాద్‌కు చెందినదే అని బయటపెట్టింది. 


హాలీవుడ్‌లో కష్టం..


‘‘పదేళ్లు ఉన్నప్పుడు యాక్టింగ్ మొదలుపెట్టాను. దానివల్లే నేను ఇండియాకు వచ్చాను. నాకోసం నా తల్లిదండ్రులు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. హాలీవుడ్‌తో యాక్టింగ్ మొదలుపెడదామంటే అప్పట్లో అక్కడ అవకాశాలు కష్టంగా ఉండేవి. సౌత్ ఏషియన్స్‌ను ఎక్కువగా ప్రోత్సహించేవారు కాదు. పైగా అప్పట్లో నేను చిన్నపిల్లని. దానివల్ల నేను రిజెక్షన్ ఎదుర్కుంటే నా ధైర్యం దెబ్బతింటుందని అమ్మ నన్ను టాలీవుడ్‌లో ట్రై చేయమని ప్రోత్సహించింది. ఫేస్‌బుక్‌లో ఒక ఆడిషన్ గురించి చూసి వీడియో పంపించాం. మూడు నెలల పాటు సినిమా అవకాశం వస్తే చేసి మళ్లీ కాలిఫోర్నియాకు వెళ్లాలని ప్లాన్ ఉంది. కానీ సినిమా ఆఫర్లు ఎక్కువగా వచ్చి, నాకు ఇంట్రెస్ట్ పెరగడం వల్ల అయిదేళ్లు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అంటూ తన యాక్టింగ్ కెరీర్ గురించి వివరించింది అవంతిక. అయిదేళ్లలో 9 సినిమాలు చేశానని తెలిపింది.


Also Read: ప్రభాస్ 'కల్కి' ప్రమోషన్స్‌కు దీపికా పదుకొనె దూరం - కారణం అదేనా?