Kejriwal on Modi Degree:

ప్రెస్‌మీట్ పెట్టిన కేజ్రీవాల్ 

ప్రధాని క్వాలిఫికేషన్‌పై అరవింద్ కేజ్రీవాల్‌  పిటిషన్ వేయడాన్ని ఖండించిన గుజరాత్ హైకోర్టు ఆయనకు జరిమానా కూడా విధించింది. ఈ ఆరాలు అనవసరం అని తేల్చి చెప్పింది. దీనిపై ఇప్పటికే మండి పడిన కేజ్రీవాల్ మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఏం చదివారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉందని తేల్చి చెప్పారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి చదువుకోవడం చాలా కీలకం అని అన్నారు. లేదంటే అధికారులు తప్పుదోవ పట్టించే ప్రమాదముందని తెలిపారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి సరైన విద్యార్హతలు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

"ప్రధాని స్థాయి వ్యక్తి కచ్చితంగా చదువుకునే ఉండాలి. అందుకు తగ్గ విద్యార్హతలు ఉండాలి. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుంది. చదువుకోలేదంటే అధికారులు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. ప్రధాని మోదీ క్వాలిఫికేషన్‌ చూపించకపోవడానికి కారణమేంటి..? మొత్తం దేశమంతా ఇదే ప్రశ్న వేస్తోంది"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

గుజరాత్ హైకోర్టు తీర్పు షాకింగ్‌గా ఉందన్న కేజ్రీవాల్, ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు. 

"ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలేంటో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు అన్నట్టుగా ఉంది గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. నాకు షాకింగ్‌గా కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో కావాల్సిన వివరాలు తెలుసుకునే హక్కు అందరికీ ఉంటుంది. చదువుకోకపోవడం నేరమేం కాదుగా. పేదరికం కారణంగా చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. 75 ఏళ్లలో భారత్‌ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదు. దేశం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది" 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

ప్రధాని మోదీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఈ వివరాలు బయట పెట్టాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇది అనవసరమైన విషయం అని వెల్లడించింది. అంతే కాదు. ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది గుజరాత్ హైకోర్టు. ఈ మేరకు ఈ జరిమానాను గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి 2016లోనే సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్..గుజరాత్ యూనివర్సిటీకి సూచనలు చేసింది. ప్రధాని మోదీ విద్యార్హతలేంటో చెప్పాలని అడిగింది. దీనిపైనే విచారణ చేపట్టిన కోర్టు..ఆ అవసరమే లేదంటూ స్పష్టం చేసింది. 

Also Read: Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్