Chittoor News: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అయోధ్య రాముల వారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాసులు అయోధ్య రాముల వారికి 8 కిలోల వెండి, కిలో బంగారంతో పాదుకలు తయారు చేయించారు. సుమారు 44 లక్షల రూపాయలతో తయారు చేయించిన వెండి, బంగారు పాదకవచాలకు అయోధ్యలో 41 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లో వాటికి పూజలు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరులోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ వెండి, బంగారు పాదుకలను తిరిగి రామమందిరంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు దాత హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాసులు తెలిపారు.
44 లక్షల విలువైన పాదుకలు విరాళం
" 8 కిలోల వెండితో రాముల వారికి ప్రత్యేక పాదుకలు చేయించాం. ఆ పాదుకలకు కిలో బంగారంతో కవచం చేయించాం. వెండికి 8 లక్షల రూపాయలు, కిలో బంగారానికి 36 లక్షల రూపాయలు అయింది. మొత్తం 44 లక్షల రూపాయల అయింది. ఈ పాదుకలను మొదట అయోధ్యలోని రామ మందిరంలో ఉంచి 41 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించాం. తర్వాత దేశంలోని ప్రముఖ దైవ పుణ్యక్షేత్రాల్లో పాదుకలకు ప్రత్యేక పూజలు చేయిస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో రామ పాదకవచాలకు పూజలు నిర్వహించాం. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన అనంతరం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత వెండి, బంగారు పాదుకలను భక్తుల సందర్శనార్థం ఉంచనున్నాం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గతంలో నాలుగు వెండి బిస్కెట్లు విరాళంగా అందించాం." - చల్లా శ్రీనివాసులు
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం గత సంవత్సరం విరాళాల సేకరణ ప్రారంభించారు. దాదాపు నెల రోజుల విరాళాల సేకరణ జరగ్గా అంతకంటే ముందే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యాన్ని చేరుకుంది. దేశవ్యాప్తంగా నిరుపేదల నుండి స్థితిమంతుల వరకు విరాళాలు ఇచ్చారు. అలా రూ. 1.511 కోట్ల విరాళాలు సేకరించింది ట్రస్ట్. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి, ప్రజల నుండి విరాళాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విరాళాల సేకరణ ప్రారంభమైన తర్వాత కేవలం 25 రోజుల్లో రూ.1,000 కోట్ల మార్క్ చేరుకుంది. మొత్తం 1.50 లక్షల మంది వీహెచ్పీ కార్యకర్తలు ఈ విరాళాల సేకరణలో భాగస్వాములు అయ్యారు. సేకరించిన విరాళాలను డిపాజిట్ చేసే బాధ్యతను 35 మంది వాలంటీర్లకు అప్పగించారు. మారుమూల పల్లెలకు సైతం వీహెచ్పీ కార్యకర్తలు వెళ్లి విరాళాలు సేకరించారు.
ఇక 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్లో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఫిబ్రవరి 2020లో ఆలయ ట్రస్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.