RK Roja in Nagiri Constituency: చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఆర్కే రోజాపై స్థానికంగా బాగా వ్యతిరేకత ఉందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయం స్పష్టం అయింది. మంత్రి రోజాపై వైసీపీకే చెందిన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్‌ భువనేశ్వరి తాజాగా ఆర్కే రోజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్ పదవి కోసం రోజా డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. రోజా తనను రూ.70 లక్షలు డిమాండ్ చేశారని.. చివరికి తాను రూ.40 లక్షలు ఇచ్చానని ఆరోపించారు. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి తాను మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆఖరికి మున్సిపల్ ఛైర్మన్‌ పదవి ఇవ్వకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని భువనేశ్వరి ఆరోపించారు.


మరోవైపు, చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి రోజా గురించి చెబుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. కక్ష సాధింపుతో రోజా తమను ఇబ్బందులకు గురి చేశారని.. ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు రోజా ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జడ్పీటీసీలకు ప్రత్యేక గదులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను నిలదీశామని వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు జడ్పీటీసీలు మాట్లాడారు.