అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగ‌ళ‌వారం పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023(Test Team Of The Year) ను ప్రక‌టించింది. గతేడాది సత్తాచాటిన ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ఎంపిక చేస్తూ టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20, వన్డే జట్టులను వెల్లడించిన ఐసీసీ తాజాగా టెస్టు జట్టును ప్రకటించింది.  నిరుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్త‌మంగా రాణించిన 11 మందిని ఎంపిక చేసింది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC) 2023 ఫైన‌ల్లో ఆడిన భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల నుంచి ఏడుగురుని ఐసీసీ సెలెక్ట్ చేసింది. ప్యాట్ క‌మిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా ఉన్న ఈ జ‌ట్టులో ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు చోటు ద‌క్కించుకోగా.. టీమిండియా నుంచి ఆల్‌రౌండ‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు ఎంపిక‌య్యారు. ఇంగ్లండ్ నుంచి ఇద్ద‌రు, న్యూజిలాండ్, శ్రీ‌లంక జ‌ట్టు నుంచి ఒక్కరు ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023లో స్థానం ద‌క్కించుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్టు టీమ్‌లో వరుసగా మూడు సార్లు చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2023తో పాటు 2021, 2022 ఏడాది క్యాలెండర్ ప్రదర్శన ఆధారంగా ప్రకటించిన జట్టులో అశ్విన్ ఉన్నాడు.


టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ : ఉస్మాన్ ఖ‌వాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా, దిముత్ క‌రుణ‌ర‌త్నే, కేన్ విలియ‌మ్స‌న్, జో రూట్. 


ఐసీసీ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ( Odi Team Of The Year 2023) జట్టులో భారత స్టార్ ఆటగాళ్ల డామినేషన్ స్పష్టంగా కనిపించింది. గత ఏడాది వన్డే క్రికెట్‌లో భారత ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. అద్భుత ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు మరపురాని విజయాలను అందించారు. ఒక్క ప్రపంచకప్‌ ఫైనల్‌ తప్ప అన్ని సిరీస్‌లో మెరుగ్గా రాణించారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ జట్టులో ఆరుగురు భార‌త క్రికెట‌ర్లు చోటు ద‌క్కించుకున్నారు. ఈ టీమ్‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా, శుభ్‌మ‌న్ గిల్ ఓపెన‌ర్‌గా ఎంపిక‌య్యారు. సెంచ‌రీల మోత మోగించిన‌ విరాట్ కోహ్లీ, బంతితో మాయ చేసిన‌ కుల్దీప్ యాద‌వ్, సిరాజ్, ష‌మీలు జట్టులో చోటు దక్కించుకున్నారు.

 

వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), మార్కో జాన్సన్, ఆడం జంపా, మ‌హ్మద్ సిరాజ్, కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మద్ ష‌మీ

 


ఐసీసీ టీం కెప్టెన్‌గా సూర్య భాయ్‌

టీమిండియా టీ 20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు.