Chittoor News: ఫోన్లు పోవడం, చోరీకి గురికావడం చాలా సాధారణం. ఆ పోయిన ఫోన్లు దొరక్కపోవడం కూడా అంతే సాధారణం. ఫోన్ పోతే ఒకటీ రెండు చోట్ల వెతుకుతారు. దొరికిందా సరేసరి లేదంటే తూర్పు వైపు తిరిగి దండం పెడుతుంటారు చాలా మంది. అంటే ఇక ఆ ఫోన్ దొరకదని ఊరుకుంటారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయరు. అందులో ఉన్న ఫోటోలు, ఇతర డేటా కోసం బాధపడుతుంటారు. టెక్నాలజీ తెలిసిన వారు, ఫోన్లలోని ఆప్షన్లపై అవగాహన ఉన్న వారు ఆ ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. డేటా దుర్వినియోగం కాకుండా ఎరేజ్ చేస్తుంటారు. కానీ పోయిన ఫోన్ కోసం పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, దాని కోసం వెతకరు. సెల్ ఫోన్ పోగొట్టుకుని లేదా చోరీకి గురైన ఇక ఆశలన్నీ వదులుకున్న వారికి చిత్తూరు జిల్లా పోలీసులు అదిరిపోయే న్యూస్ చెప్పారు.
చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఆయా ఫోన్లు బాధితులకు అందజేసారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో మొబైల్ రికవరీ మేళా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులకు ఫోన్లు ఇచ్చారు. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
దొరకవు అనుకున్న ఫోన్లు దొరికాయి
ఆధునిక సాంకేతికత సాయంతో మొబైల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఐదు వందలకు పైగా ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అందజేశారు. చిత్తూరు జిల్లాలో కొట్టేసిన ఫోన్లు జమ్మూ కశ్మీర్ లో ఉన్నప్పటికీ లేటెస్ట్ చాట్ బాట్ టెక్నాలజీ ఉపయోగించి గుర్తించినట్టు ఎస్పీ విశ్వంత్ రెడ్డి తెలిపారు. కొన్ని కేసుల్లో భాదితుల ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేశారు చిత్తూరు పోలీసులు. ఇక దొరకవు అన్న ఫోన్లు మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించేటప్పటికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ విశ్వంత్ రెడ్డి అభినందించారు. ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసుల “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులు మళ్లీ పొందవచ్చునని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు.
చాట్ బాట్‌కు వివరాలు ఇలా పంపించాలి
ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help టెక్ట్స్ మెసేజ్ పంపాలి. తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్ట్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. తర్వాత ఆ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చాట్ బాట్ బృందం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.