Chintan Shivir:


చింతన్ శివిర్ కార్యక్రమం..


ఓ చిన్న వదంతు కూడా దేశానికి భారీగా నష్టం చేకూర్చే ప్రమాదముందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న Chintan Shivir కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల పాటు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో ఈ సమావేశం సాగనుంది. ఈ సందర్భంగానే ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల గురించి ప్రస్తావించారు. "చట్ట ప్రకారం నడుచుకునే పౌరుల హక్కులను కాపాడడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే అరాచక శక్తులను అణగదొక్కడం మన బాధ్యత. చిన్న వదంతు కూడా దేశంలో అశాంతి సృష్టిస్తుంది" అని వెల్లడించారు. "పౌరులు ఏదైనా సరే ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా వాళ్లకు అవగాహన కల్పించాలి. అది నమ్మే ముందు వెరిఫై చేసుకోవాలనీ మనం చెప్పాలి"
అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో హోం సెక్రటరీలు, డీజీపీలు, Central Armed Police Forces డైరెక్టర్ జనరల్స్, Central Police Organisations డైరెక్టర్ జనరల్స్ హాజరవుతారు. దేశ అంతర్గత భద్రతను పటిష్ఠం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. పోలీస్ ఫోర్స్‌ను నవీకరించటం సహా సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, సరిహద్దు వివాదాల పరిష్కారం, తీరప్రాంత పరిరక్షణ, మహిళా భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 






రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: ప్రధాని


"శాంతిభద్రతలు కాపాడటం రాష్ట్రాల బాధ్యతే అయినా...అది దేశ ఐక్యతను సూచిస్తుందని మరిచిపోవద్దు. పండుగల వేళల్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా...కలిసికట్టుగా ఏర్పాట్లు చేయాలి. ఈ నిబద్ధతే మన ఐక్యతకు నిదర్శనం" అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. చింతన్‌ శివిర్‌ వల్ల రాష్ట్రాల్లో స్ఫూర్తి పెరుగుతోందని, ఓ రాష్ట్రాన్ని చూసి మరో రాష్ట్రం శాంతి భద్రతలు కాపాడటంలో కొత్త దారులు వెతుక్కుంటున్నాయి" అని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాలేదని, టెక్నాలజీతో రాష్ట్రాలన్నీ పరస్పరం సహకరించుకుంటూ సమాజంలో అశాంతిని రూపుమాపాలని సూచించారు. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని వివరించారు. 


Also Read: Russia Ukraine War: అణ్వాయుధాల ప్రయోగంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు!