China-Taiwan Conflict:
తైవాన్ హెచ్చరిక...
తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మిలిటరీ డ్రిల్స్‌తో టెన్షన్ పెడుతోంది. దాదాపు 71 ఫైటర్ జెట్‌లను తైవాన్ వైపుగా మొహరించింది. యుద్ధం తప్పదేమో అన్న ఆందోళనా మొదలైంది. ఈ క్రమంలోనే తైవాన్ కూడా చైనాకు గట్టి బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. చైనాపై పోరాటం చేసేందుకు దేశమంతా కసరత్తు చేస్తోంది. తైవాన్ ఆర్మీ ఆయుధాలు, రేడార్‌లను సిద్ధం చేసుకుంటోంది. అమెరికా నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఇదో హాట్ టాపిక్ అయింది. అయితే...ఇంతలోనే చైనా మాట మార్చింది. కేవలం మిలిటరీ డ్రిల్స్ మాత్రమే నిర్వహిస్తున్నామంటూ బుకాయిస్తోంది. తమను అపార్థం చేసుకుంటున్నారని చెబుతోంది. అమెరికా ఈ పరిణామాలను పరిశీలిస్తోంది. అయినా తైవాన్ మాత్రం యుద్ధానికి సిద్ధమే అని స్పష్టం చేసింది. తైవాన్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. "మా దేశ రక్షణ కోసం అంతా ఒక్కటవుతాం" అని వెల్లడించింది. తమ దేశ గగనతలంలో చైనాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు తిరుగుతున్నాయని, తమ ఎయిర్ స్పేస్‌లోకి వచ్చాయని తెలిపింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. ట్విటర్ వేదికగా ఈ విషయం వెల్లడించింది.
"తైవాన్ మా దేశం. ఇదే మా ఇల్లు. ఎంతో అందమైన ప్రాంతమిది. ఈ నేలతో మాకు ఎంతో అనుబంధముంది. అణువణువునా మా జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. మా ఇంటిని మేం రక్షించుకునేందుకు కలిసి కట్టుగా పోరాడతాం"
- తైవాన్ రక్షణ శాఖ
ఇప్పటికే తైవాన్...చైనాకు వార్నింగ్ ఇచ్చింది. "మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి" అంటూ హెచ్చరించింది. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఏం చేసినా తలొగ్గం అని స్పష్టం చేసింది.