చిన్నారులకు సామాజిక రక్షణ అందించాలి..


పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చాలా  మంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని పిల్లల్ని కూలీ పనులకు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. ఇది చాలా చోట్ల చూస్తున్నదే. చిన్నారులతో పని చేయించటం నేరం అని తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టాలు కఠినంగా ఉన్నా అన్ని చోట్లా ఇది అమలు కావటం లేదు. ఈ సమస్యను పరిష్కారించాలన్న పిలుపుతో ఏటా జూన్ 12వ తేదీన ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యుక్త వయస్కులు ప్రమాదకరమైన స్థలాల్లో పని చేస్తున్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీరందరినీ ఈ వలయం నుంచి బయటపడేయాలన్నదే ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు "చిన్నారులకు సామాజిక రక్షణ" అందించటమే ఈ ఏడాది నినాదంగా పెట్టుకున్నారు. 


బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం మొదలైంది అప్పుడే..


2017లో అంతర్జాతీయ కార్మిక సంస్థ-ILO భారత్‌లోని స్థితిగతులను లెక్కలతో సహా వివరించింది. దేశవ్యాప్తంగా 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారిలో దాదాపు 20% మంది ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్నట్టు తేల్చి చెప్పింది. 17 ఏళ్లు నిండకుండానే పనుల్లో చేరుతున్న వారి సంఖ్య కోటికిపైగానే ఉంది. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే  భారత్‌లో ఈ సవాలు అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు నిపుణులు. 2002లో మొదటి సారి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. బాల కార్మిక వ్యవస్థ వల్ల చిన్నారులకు ఎంత హాని కలుగుతోందో అవగాహన కల్పించటమే ప్రధాన లక్ష్యంగా అప్పటి నుంచి ఏటా ఓ థీమ్‌తో ఇది జరుపుకుంటున్నారు.


మానవ అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణా సహా వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి ప్రధాన కారణం బాల కార్మిక వ్యవస్థే. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్థానిక ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిస్తోంది ILO. అంతర్జాతీయ సంస్థలూ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఈ కూపంలో నుంచి బయటపడేసి చిన్నారులకు మంచి విద్య అందించాలని కృషి చేస్తున్నాయి. పిల్లలు పనుల్లోకి వెళ్లకుండా రక్షించుకోవాలని సూచిస్తున్నాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా నిధులు సేకరించాలని భావిస్తున్నాయి. వీలైనంత త్వరగా అంతర్జాతీయంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. భారత్‌లోనూ పలు సంస్థలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.