Telugu States: ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్  అనంతర పరిస్థితులపై  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ముందస్తు గా చేపట్టాల్సిన చర్యలపై  ఉన్నతాధికారులకు పలు సూచనలు  చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా.. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ రంగానికి చెందిన సంస్థ ల దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలి..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. 

Continues below advertisement


హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ, కేంద్ర నిఘా బృందాలతో   రాష్ట్ర నిఘా  బృందాలు సమన్వయం చేసుకోవాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.  భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీ పైన చర్చించారు.  ర్యాలీ లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని  ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.  భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు. 


చంద్రబాబు సమీక్ష 


‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు సిఎస్, డీజీపీలతో పాటు టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, ఆర్ అండ్ బి తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్, సిఐఎస్ఎఫ్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, సన్నద్దతపైనా... అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంపైనా చర్చించారు. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమీక్షలో ఆయా విభాగాలు తమ సన్నద్దతను సమావేశంలో వివరించాయి. అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ‘‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలి. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతపై పలు సూచనలు చేసింది. వాటిని పూర్తిగా అమలు చేయాలి. ఇలాంటి సమయంలో అన్ని శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలి. ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలి. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీటీడీ వంటి చోట్ల ప్రత్యేక రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. 24 గంటలు అన్ని శాఖల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్ర సంస్థలకు అవసరమైన అన్నిరకాల సహకారం అందిస్తామని... ఏ సమయంలో అయినా తమను సంప్రదించవచ్చని తెలిపారు.


పకడ్బందీగా జరిగిన సివిల్ మాక్ డ్రిల్ 


మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో అధికారులు మాక్ డ్రిల్ చేపట్టారు. హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహించారు. భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల వేళ ఏదైనా జరగొచ్చని కేంద్రం అనుమానిస్తోంది. అందుకే పౌరులను సన్నద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఆపరేషన్‌ అభ్యాష్ పేరుతో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేపట్టాయి భద్రతా దళాలు. ఈ డ్రిల్‌లో భద్రతాదళాలతోపాటు సామాన్య జనం పాల్గొన్నారు. విపత్కార పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రజలకు తెలియజేశారు. మాక్ డ్రిల్‌ నిర్వహించడానికి ముందు రెండు నిమిషాలపాటు హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో సైరన్ మోగించారు. యుద్ధం వచ్చినట్టు అయితే పౌరులు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం జాగ్రత్లు తీసుకోవాలి, పాటించాల్సిన రూల్స్ ఏంటి అనే విషయాలపై భద్రతా దళాలు సూచనలు చేశాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఈ మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు.   పైరింగ్, బాంబులు వేసినట్టు, జనంలోకి ఉగ్రవాదులు వచ్చి అలజడి సృష్టించినట్టు ఈ డ్రిల్‌లో చేసి చూపించారు. అలాంటి టైంలో ప్రజలు ఏం చేయాలి ఎలా సురక్షితంగా బయటపడాలనే విషయాలను ప్రదర్శించారు. భారీ ఎత్తైన బిల్డింంగ్స్ ఇత ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహించారు. పదికిపైగా శాఖల అధికారులు ఈ ప్రక్రియలో భాగమయ్యారు. ఇలాంటి దుర్ఘటన నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా గాయపడిన వారిని ఎలా రక్షించించాలో కూడా తెలియజేశారు.