80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో బాలుడు
ఛత్తీస్‌గఢ్‌లోని జంగీర్ చంప జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ 11 ఏళ్ల బాలుడు 80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. అప్పటి నుంచి బాలుణ్ని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ఎస్కేప్ టన్నెల్ తవ్వే పనిలో నిమగ్నమైంది. లోపలకు కెమెరా పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు వైద్యులు. బోర్‌వెల్ ద్వారానే అరటిపండ్లు, బిస్కెట్లతో పాటు ఆక్సిజన్‌నీ అందిస్తున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలోనే గుజరాత్ వాసి ఒకరు రోబోల సాయంతో బాలుడిని బయటకు తీసుకు రావచ్చని సూచించారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ల కోసమే తాను ప్రత్యేకంగా రోబోలను తయారు చేశానంటూ చెప్పారు. వెంటనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆయనను సంప్రదించారు.
రోబో సాయంతో రక్షించేందుకు ప్రయత్నాలు
గుజరాత్‌కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగి బాలుడిని సురక్షితంగా బోర్‌వెల్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. నిపుణుల సమక్షంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని రక్షించేదే. కానీ ఎస్కేప్ టన్నెల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డు తగులుతున్నాయి. హ్యాండ్ కట్టర్ డ్రిల్ మెషీన్లు లేకపోవటమూ సమస్యగా మారింది. పెద్ద పెద్ద రాళ్లను కట్ చేయటం చాలా కష్టమవుతోంది. హెవీ మెషినరీతో పాటు రాక్ బ్రేకర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబోటిక్ టీమ్ బోర్‌వెల్‌లోని స్థితిగతులను అంచనా వేస్తూ ఆపరేషన్ చేపడుతోంది. బాలుడిని బయటకు తీసుకు రావటానికి కనీసం 10-15 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సీఎం భూపేశ్ బాగేల్ అధికారులతో చర్చిస్తూ వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. మరెక్కడ బోర్‌వెల్స్ ఉన్నా వాటిని సరైన విధంగా మూసివేయాలంటూ ఎస్‌పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించటం లేదు. బోర్‌వెల్స్‌ని సరైన విధంగా కప్పి ఉంచాలన్న ఆదేశాలనూ ఎవరూ పట్టించుకోవటం లేదు. చిన్నారులు ఆడుకుంటూ ఇలా బోర్‌వెల్‌లో పడిపోయిన ప్రతిసారీ రెస్క్యూ ఆపరేషన్‌కు కనీసం రెండు, మూడు రోజులు పడుతోంది. కొన్ని సందర్భాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించాలన్న ఆలోచన కూడా చేయటం లేదు. ఫలితంగా కొందరు చిన్నారులు బోర్‌వెల్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇప్పుడదే జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ పురోగతి కనిపింౘలేదు. రోబో సాయంతోనైనా చిన్నారి సురక్షితంగా బయటపడతాడేమో చూడాలి.