Chandrayaan 4 Mission Objectives:  చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇస్రో చంద్రయాన్ 4పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనికి సంబంధించి అప్పుడప్పుడూ కీలక వివరాలు వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం చెప్పింది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ National Space Science Symposiumలో దీని గురించి ప్రస్తావించారు. చంద్రయాన్ 4 మిషన్‌ లక్ష్యాలేంటో వివరించారు. కేవలం చంద్రుడిపై ల్యాండ్ అవడమే కాకుండా...అక్కడి మట్టి, రాళ్ల శాంపిల్స్‌ని తీసుకొచ్చేలా ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. చంద్రుడిపై ఉన్న మట్టి శాంపిల్స్‌ని జాగ్రత్తగా సేకరించి...వాటిని అంతే జాగ్రత్తగా భూమిపైకి తీసుకురావాలన్నదే ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు సోమనాథ్. ఈ శాంపిల్స్‌ని సైంటిఫిక్ స్టడీ కోసం వినియోగిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలు మాత్రమే ఈ శాంపిల్స్ సేకరించగలిగాయి. అపోలో మిషన్స్ ద్వారా అమెరికా, లూనా ప్రోగ్రామ్ ద్వారా సోవియట్ యూనియన్, Chang'e మిషన్స్‌తో చైనా ఈ నమూనాలు సేకరించాయి. 


చంద్రయాన్ 4 లక్ష్యాలివే..


చంద్రయాన్ మిషన్ సిరీస్‌లో ఇది నాలుగో ప్రాజెక్ట్. చంద్రయాన్ 3 లో కేవలం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. చంద్రయాన్ 4 లో మాత్రం పలు లక్ష్యాలు నిర్దేశించుకుంది. 


1. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అవడం. 
2.చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి శాంపిల్స్‌ని సేకరించడం. 
3.ఉపరితలంపై వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం.
4.శాంపిల్స్‌ని ఓ మాడ్యూల్ నుంచి మరో మాడ్యూల్‌కి సురక్షితంగా బదిలీ చేయడం.
5.పని పూర్తైన తరవాత విజయవంతంగా భూమిపైకి రావడం. 


అయితే...ఈ లక్ష్యాలు సాధించడం అంత సులువేమీ కాదని ఇస్రో వివరిస్తోంది. అటు సైంటిఫిక్‌గా, ఇటు ఇంజనీరింగ్ పరంగా సంక్లిష్టంగా ఉంటుందని వెల్లడించింది. కేవలం చంద్రుడి ఉపరితలంపై దిగడమే కాకుండా...ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్‌తో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్‌ ఉండేలా చేయడం అసలైన సవాలు అని తెలిపింది. ఈ మిషన్‌ని రెండు దశల్లో చేపడతామని ఇప్పటికే ఇస్రో వెల్లడించింది. 


చంద్రయాన్-3 సక్సెస్‌తో (Chandrayaan-3 Mission) ఇస్రో పేరు అంతర్జాతీయంగా మారు మోగింది. అత్యంత కష్టమైన సౌత్‌పోల్‌పై ల్యాండర్‌ని చాలా సేఫ్‌గా ల్యాండ్‌ చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్స్  (ISRO Lunar Missions)చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో రెండు కీలక లూనార్ మిషన్స్‌ని చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి  LuPEx, మరోటి చంద్రయాన్-4 (Chandrayaan-4).ఈ మిషన్‌ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్‌లను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో ఇటీవల INSAT 3DS శాటిలైట్‌ని (ISRO Future Missions) విజయవంతంగా ప్రయోగించింది. GSLV-F14 రాకెట్‌ ద్వారా 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్‌-3డీఎస్‌ను నింగిలోకి పంపింది. విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితల వాతావరణాలపై ఈ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఈ పరిశోధనల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇస్రోకి అందించనుంది.