chandrababu visits kcr at yashoda hospital : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. తుంటి గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా, కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6 నుండి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.             


ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి                                     


కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని.. ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వివరించారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుని.. మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని..  కేసీఆర్‌ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలన్నారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయన్నారు.                                                                         


పరామర్శ సమయంలో  కాసేపు చంద్రబాబు కేసీఆర్ తో మాట్లాడారు. జారిపడిన ఘటన గురించి తెలుసుకున్నారు. అక్కడే వైద్యులతో మాట్లాడారు.  చంద్రబాబు, కేసీఆర్ చాలా కాలం తర్వాత మాట్లాడుకున్నారు. దాదాపుగా ఐదారేళ్లుగా వారిద్దరూ  ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదు. వారి మధ్య జరిగిన సంభాషణ ఇది.          


CBN : ఏమ్మా.?


KCR : హిప్ కి చేశారు


CBN : అమ్మా.!


KCR : హిప్ రీప్లేస్ చేశారు.!


Doctors : ఇంతకు ముందు రైట్ సైడ్ చేశారు సర్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్


CBN : అప్పుడు ఎట్లా అయ్యింది.?


KCR : అప్పుడు కూడా స్లిప్ అయ్యాను. టైల్స్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి.


CBN : టైల్స్ స్మూత్ గా ఉంటాయ్. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం.


KCR : మీ హెల్త్ ఓకేనా.?


CBN : పర్లేదు.



రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉంది. సుదీర్ఘ కాలంగా కలసి పని చేశారు. మధ్యలో రాజకీయ కారణాలతో విడిగా పయనం చేస్తున్నప్పటికీ..  పరస్పర విమర్శలు చేసుకున్నప్పటికీ... ఇలాంటి సమయాల్లో రాజకీయాలను పక్కన పెట్టి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.