YSRCP Gajuwaka in charge Devan Reddy resign : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి . మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి ( Devan Reddy ) కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.   గాజువాకలో పవన్ కల్యాణ్ ని ( Pawan Kalyan ) ఓడించి వైసీపీ తరపున బలంగా నిలబడ్డారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. గాజువాకలో నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.  ఈ సమయంలో సడన్ గా దేవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారింది. ఈ రాజీనామాపై దేవన్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఇంకా స్పందించలేదు కానీ.. ఆయన కూడా పార్టీకి దూరమవుతారనే  ప్రచారం జరుగుతోంది. 


దేవాన్ రెడ్డి రాజీనామా చేసిన వంటనే వైసిపి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమిస్తూ, పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు నియోజవర్గం ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, తిప్పల దేవన్ రెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడంతో, ఆస్థానంలో అమర్నాథ్ ను నియమించినట్లుగా పార్టీ ప్రకటించింది. 


సోమవారం రోజే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా రాజీనామా చేశారు.  ఆర్కే మొదటి నుంచి జగన్‌కు నమ్మిన బంటు లాంటి నాయకుడు. రెండుసార్లు మంగళగిరి నుంచి విజయం సాధించారు. రెండోసారి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించినా లోకేష్‌ను ఓడించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ సంచలనంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లెటర్‌ను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పంపించారు. పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మరో లెటర్‌ను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు.             


వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో పాటు జిల్లాలో పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ఎక్కువ మంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలుకూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా పలువురు రాజీనామాలు చేసే అవకాశం ఉందని వైసీపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఈ సారి  బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని జగన్  భావిస్తున్నారు. అందుకే రెడ్డి సామాజికవర్గాల వారికి టిక్కెట్లు తగ్గిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చిలోనే వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. 


అయితే రాజీనామాలు చేసిన వారిని వైసీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే.. గంజి చిరంజీవిని పార్టీ నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.