Chandra Babu Comments: అమరావతి రాజధానిని మూడు ముక్కల‌ ఆట ఆడిన జగన్ ఆట కట్టిస్తానని గుంటూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని మార్చడం ఎవ్వరితరం కాదని అన్నారు. విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అభివృద్ధి వల్లే ఉపాధి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‌ఐటీ‌ ఆయుధంతో యువతకు భవిష్యత్తు  ఇచ్చానన్నారు. అమెరికన్ల ఆదాయం 64 వేల‌ డాలర్లు అని, యూఎస్ లో ఉన్న భారతీయుల ఆదాయం.1.25 లక్షల డాలర్లు అని తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణం తానే చేస్తానని ప్రతిజ్ఞా చేశారు. నాయకులకు తెలివి తేటలు ఉంటే‌ సంపద సృష్టిస్తారని పేర్కొన్నారు. హైదాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు162 కిలోమీటర్లు మాత్రమే ఉండగా.. అమరావతిని మరింత అభివృద్ధి చేసేందుకు రాజధాని చుట్టు 187 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదించానన్నారు. మలేషియా రోడ్లు చూసిన తర్వాత అక్కడ టోల్ గేట్ విధానం ద్వారా అభివృద్ధి చేసారని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆదే  విధానం అప్పటి ప్రధానికి వాజపేయికి చెప్పి దేశంలో నేషనల్‌ హైవే  రోడ్లు వేయించానని తెలిపారు.


హైదరాబాదు అభివృద్ధి నావల్లే..!


గతంలో హైదరాబాద్‌లో ఎకరా భూమి వేల రూపాయలు మాత్రమే ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత కోట్లకు పెరిగిందని తెలిపారు. అమరావతితో జగన్ మూడు మక్కల ఆట ఆడారని.. కులముద్ర వేసి రాజధానిని ధ్వంసం చేశాడన్నారు. రాజధాని భూములలో కుంభకోణం జరిగిందని చెప్పి నిరూపించ‌లేక పోయారన్నారు. రాజధానిలో కూలీలకు 2500 పెన్షన్ ఇచ్చానని గుర్తు చేశారు. అమరావతిలో బిల్డింగ్స్‌ గ్రాఫిక్స్ అని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. నిజమో కాదో తెలుసుకోవాలంటే బిల్డింగ్ పై నుంచి దూకితే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిని అడ్డుకోవడం ఎవ్వరి వల్లాకాదని స్పష్టం చేశారు.


గూగుల్ పే, ఫోన్ పై వైన్స్‌లో ఎందుకు లేదంటే?


రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదివుకునే పిల్లలు పొలాల్లో పని చేసే పరిస్థితి దాపురించిందిని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులకు ట్రైసైకిల్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందకుని అన్నారు. బాపట్ల ఎంపీ ఇసుక దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. నాశిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. కిరాణా షాపులో పేటీయం, గూగుల్ పే ఉందని.. కానీ వైన్ షాపులలో క్యాష్ అండ్ క్యారీ పెట్టారని అన్నారు. అందుకు కారణం ముడుపులు తాడేపల్లి పంపేదుకే క్యాష్ అండ్ క్యారీ అని విమర్శించారు. జగనన్న వదిలిన బాణం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. కన్నతల్లి మీద ప్రేమ, సోదరిపై అభిమానం లేని వ్యక్తి జగన్ అన్నారు. తన‌ వయస్సు నెంబరు మాత్రమేనని జగన్ తన స్పీడును ఏమాత్రం అందుకోలేరని చెప్పారు. 


ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మూడు రోజులపాటు అమరావతి, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాలలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి  కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందంటున్నారు నేతలు. ప్రతి నియోజకవర్గంలో రోడ్ షోలు, మీటింగ్ లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు స్థానిక సమస్యలను‌ తెలియచేస్తూ చేసిన ప్రసంగాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయన్నారు.