Centre Bans PFI: 


నిషేధించటం పరిష్కారం కాదు: కాంగ్రెస్ ఎంపీ


పాపులర్ ఫ్రంట్ ఇండియాపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని భాజపా నేతలు స్వాగతిస్తున్నారు. అయితే..కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ చీఫ్ విప్‌ కొడికున్నిల్ సురేష్ మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పీఎఫ్‌ఐ (PFI)తో పాటు RSSని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. PFI,RSS..రెండూ ఒకటేనని ఘాటైన వ్యాఖ్యలుచేశారు. "PFIని మాత్రమే ఎందుకు బ్యాన్ చేశారు..? RSSని కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. PFIని నిషేధించటం మాత్రమే పరిష్కారం కాదు. RSS కూడా హిందూ కమ్యూనలిజాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. RSS,PFI రెండూ సమానమే. అందుకే...కేంద్రం ఈ రెండింటిపైనా నిషేధం విధించాలి" అని అన్నాకు కాంగ్రెస్ నేత సురేష్. భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది.






కొద్ది రోజులుగా సోదాలు..


సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ నేతలను అరెస్టు చేసింది. కేరళలో ఎక్కువగా అరెస్టులు జరిగాయి. అక్కడ దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, తమిళనాడులో 10, అసోంలో 9, యూపీలో ఎనిమిది మంది, ఏపీలో ఐదుగురు, మధ్యప్రదేశ్ లో నలుగురు, పుదుచ్చెరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్ లో ఇద్దరు అరెస్టు అయ్యారు. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఏడుగురు పీఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా వీరిలో కొందరు నిరసనలు చేశారు. పీఎఫ్ఐ బాగల్ కోట్ జిల్లా ప్రెసిడెంట్ అస్గర్ అలీ షేక్ కూడా అరెస్టు అయ్యారు. ఇంకా కలబురిగి, రాయచూర్, కోలార్, రామనగర, విజయపుర, బెళగావి, హుబ్బళ్లి - ధార్వాడ్, హాసన్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించిన పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్​ఐపై ఇలా కేసులు నమోదు కావడం ఇదేం కొత్త కాదు. 2020లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల సమయంలో చాలా కేసులు పీఎఫ్ఐపై నమోదయ్యాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రాసో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ వ్యవహారంలో కుట్ర లాంటి ఇంకా వేర్వేరు సందర్భాల్లో పీఎఫ్​ఐ ఆర్థికంగా మద్దతు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.


Also Read: China President Xi Jinping: జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ ఉత్తిదే- బీజింగ్‌లో ప్రత్యక్షమైన చైనా అధ్యక్షుడు!