Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసింది. పలు రాష్ట్రాల్లో వైద్యులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమైంది. మహిళా వైద్యుల భద్రతకు సంబంధించి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రతి రెండు గంటలకోసారి అప్‌డేట్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిపోర్ట్స్ పంపుతున్నట్టు సమాచారం. ఆగస్టు 16వ తేదీ నుంచే ఈ నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి రిపోర్ట్‌ని సరైన సమయానికి పంపించాలని చాలా గట్టిగా చెప్పింది. కోల్‌కత్తా డాక్టర్ కేసులో ఎక్కడో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సమస్యని తీర్చేందుకే రిపోర్ట్‌లు పంపించాలని కేంద్రం ఆదేశించింది.
ఆగస్టు 9వ తేదీన కోల్‌కత్తాలో ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా సెమినార్ హాల్‌లో శవమై కనిపించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. ఆమెపై అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఆ అత్యాచారం జరిగిన తీరు కూడా అందరిలోనూ ఆగ్రహం పెంచింది. వైద్యులు తమకు భద్రత కల్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటనను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే...శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రే ఇలా ర్యాలీ చేయడమేంటని అంతా మండి పడుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తామే ర్యాలీ చేసుంటారా అంటూ కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. "మీరే సీఎం అన్న సంగతి మర్చిపోయారా" అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే...సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలన్న డిమాండ్‌తోనే దీదీ ర్యాలీ చేశారని ఆ పార్టీ సీనియర్ నేతలు క్లారిటీ ఇచ్చారు.
Also Read: Doctor Abused: డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై వేధింపులు, మద్యం మత్తులో వచ్చి దాడి చేసిన పేషెంట్