TTD News: ఏపీలో ఈ మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగి ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే కాలిపోయే స్కీమ్ నడుస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఏపీ లో జరుగుతున్న ప్రమాదాల పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, అందులోని వస్తువులు ఇలా ఆస్తి నష్టమో లేదా కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టమో జరిగేది. కాని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మాత్రం కేవలం ఫైల్స్ మాత్రమే కాలిపోయి సాక్షం లేకుండా అయ్యేలా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. ఇలాంటి ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా దృష్టి పెట్టింది.
మొన్న అమరావతి, నిన్న మదనపల్లి, దవళేశ్వరం కార్యాలయం.. నేడు తిరుపతి... అగ్ని ప్రమాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక అవకతవకలు జరిగాయని, తిరుమలను కూడా వ్యాపార కేంద్రంగా మార్చారని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎనలేని మెజారిటీతో గెలిపించారు. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమల కు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు. అందుకు తగిన రీతిలో అప్పటి వరకు ఈవో లేకపోవడంతో కొత్త ఈవో నియామకం, అదనపు ఈవో గా ఉన్న ఏవీ ధర్మారెడ్డి ను పంపివేయడం... కొత్తగా తిరుమల అదనపు ఈవో నియామకం చేయడం... సీవీఎస్వో సహా అందరినీ మార్చడం చేశారు. ఇలా ప్రారంభమైన ప్రక్షాళన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఇంజినీరింగ్ పనులు, రీవర్స్ టెండర్స్, శ్రీవాణి ట్రస్ట్ నిధులపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ విభాగం చేత విచారణ ప్రారంభించారు. టీటీడీ లాంటి పుణ్యక్షేత్రం లో విజిలెన్స్ విచారణ అంటేనే దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
టీటీడీ లో గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఇంజినీరింగ్ పనులకు సంబంధించి వివరాలు ఇవ్వని, సరైన పత్రాలు చూపించని టీటీడీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన 55 మంది ఇంజనీర్లకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఇంజినీరింగ్ యూనియన్ సభ్యులు స్థానిక నాయకులను, అధికారులను సైతం కలిసారు. వారు నుంచి సానుకూలంగా స్పందించినా ఈనెల 14న సమావేశం నిర్వహించి అవసరమైతే సమ్మె చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే సమావేశం వాయిదా పడింది. రెండు రోజుల వ్యవధిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది.
దీపం పడి ఫైల్స్ కాలిపోయాయి..
టీటీడీ పరిపాలన భవనంలో శనివారం సాయంత్రం ఇంజినీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజినీర్ భాస్కర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక ఫైల్స్ దగ్థం అయ్యాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిని ఆర్పివేసారు. అయితే ఎలా ప్రమాదం జరిగిందని అధికారులను అడిగితే ప్రతిరోజు పూజించే దీపం పడి ప్రమాదం జరిగిందేమే అని అంటున్నారు.
టీటీడీ పరిపాలన భవనం ఇటీవల కాలంలో రినోవేషనే చేశారు. అన్ని విభాగాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి టీటీడీ పరిపాలన భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు. మరీ దీపం పడి ఫైల్స్ మాత్రమే కాలిపోవడం ఏంటని ప్రశ్న వినిపిస్తుంది. సమాచారం అందుకున్న టీటీడీ ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ గదిలో ఏఏ రికార్డులు ఉన్నాయి.. అవి ఈ ఫైలింగ్ లో ఉన్నాయా లేదా... అసలు ప్రమాదానికి కారణం ఏంటి... ఏదైన కుట్ర కోణం ఉందా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.