Public Phone Charging Ports: ఎయిర్‌పోర్ట్‌లు, హోటల్స్, బస్‌స్టాండ్‌లు, కేఫ్‌లు..ఇలా ప్రతి చోటా మొబైల్ ఛార్జింగ్ పోర్టల్స్ అందుబాటులో ఉంటున్నాయి. పవర్ బ్యాంక్‌ లేని వాళ్లకి ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోంది. చాలా మంది ఇక్కడ మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. అయితే...కేంద్ర ప్రభుత్వం ఓ హెచ్చరిక చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఫోన్‌లను ఛార్జింగ్ పెట్టుకోవడం మానుకోవాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే USB Charger Scam గురించి ప్రస్తావించింది. 


ఏంటీ స్కామ్..?


సైబర్ నేరాల వలలో చాలా మంది సులువుగా చిక్కుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంత అప్రమత్తం చేస్తున్నా తెలియకుండానే వాటి బారిన పడుతున్నారు. అటు సైబర్ నేరగాళ్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటిదే ఈ USB Charger Scam. ఎయిర్‌పోర్ట్‌లు, బస్‌స్టాండ్‌లు, కేఫ్‌లలో ఉన్న మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. వాటితోనే స్కామ్‌లు చేసేస్తున్నారు. USB స్టేషన్స్‌లోని ఛార్జింగ్ డివైజ్‌లు juice jacking సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ జాకింగ్ సైబర్ అటాక్ అంటే...సైబర్ నేరగాళ్లు ఇలా బహిరంగ ప్రదేశాల్లోని USB ఛార్జింగ్ స్టేషన్‌లను టార్గెట్‌గా పెట్టుకుంటారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు యూజర్ డేటాని చోరీ చేస్తారు. అంతే కాదు. అందులో మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్ చేస్తారు. అలా మొబైల్స్‌ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ డేటా అంతా మళ్లీ తిరిగి ఇచ్చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తారు. 


ఇలా జాగ్రత్తపడండి..


ఇలాంటి USB ఛార్జింగ్ పోర్ట్స్‌కి బదులుగా ఎలక్ట్రికల్ వాల్స్ ఉన్న చోటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. లేదంటే పవర్ బ్యాంక్‌ని వెంట తీసుకెళ్లడం ఇంకా మంచిది. మొబైల్‌కి లాక్ వేయడంతో పాటు తెలియని డివైజ్‌లతో పెయిర్ చేయడం మానుకోవాలి. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి.