H9N2 Outbreak in China:
చైనాలో ఫ్లూ కేసులు..
న్యుమోనియా దాడితో (China Pneumonia Cases) చైనా సతమతం అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. చైనాలో ఉన్నట్టుండి ఈ కేసులు పెరుగుతుండడం ప్రపంచదేశాలనూ భయపెడుతోంది. మళ్లీ కొవిడ్ తరహా మహమ్మారి దాడి చేస్తుందేమోనని వణికిపోతున్నాయి. ప్రస్తుతానికి చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌కి H9N2 గా పిలుస్తున్నారు. దీన్నే Avian influenza virusగా చెబుతున్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే భారత్ కీలక ప్రకటన చేసింది. చైనాలో ఫ్లూ కేసులు పెరగడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. భారత్‌కి ఈ ముప్పు పెద్దగా ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో ఈ కేసులు పెరిగిన వెంటనే Directorate General of Health Services (DGHS) ప్రత్యేకంగా సమావేశమైంది. భారత్‌లో ఇదే ఫ్లూ వ్యాప్తి చెందితే ఎలా కట్టడి చేయాలో చర్చించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఫ్లూపై ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు తక్కువేనని, మరణాల రేటు కూడా తక్కువేనని వెల్లడించింది.
"ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని ఫ్లూ కేసులపై అసెస్‌మెంట్ చేసింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు చాలా తక్కువేనని తేల్చింది. మరణాల రేటు కూడా తక్కువే నమోదయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు H9N2 కేసులను పరిశీలిస్తోంది. ఇప్పటికైతే భారత్‌కి వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది"
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నదీ నిఘా పెట్టాలని కేంద్రం అధికారుల్ని అప్రమత్తం చేసింది. ఇక చైనా విషయానికొస్తే...కొవిడ్ తరవాత ఆ స్థాయిలో హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. అన్ని స్కూల్స్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ కెపాసిటీకి మించి బాధితులు చేరుతున్నారు. విద్యార్థులతో పాటు టీచర్‌లూ ఈ వైరస్ బారిన పడుతుండడం వల్ల పూర్తిగా స్కూల్స్ మూతబడుతున్నాయి.
Also Read: Deepfake Crackdown: డీప్‌ఫేక్ కంటెంట్‌పై నిఘా పెట్టనున్న స్పెషల్ ఆఫీసర్, కేంద్రం కీలక నిర్ణయం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply