Citizenship Amendment Act implementation: కేంద్ర ప్రభుత్వం CAA పై కీలక ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచి (మార్చి 11, 2024) ఈ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుజల చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. పార్లమెంట్‌లో ఐదేళ్ల క్రితం ఈ బిల్ పాస్ అయింది. అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. 2019 బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో CAA ని చేర్చింది బీజేపీ. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం వివరిస్తోంది.
పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందని చెబుతోంది. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు,బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్‌లకు పౌరసత్వం లభిస్తుందని కేంద్రం గెజిట్‌లో తెలిపింది. నాటి పాత చట్టంలో మార్పులు చేర్పులు చేసి 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది.
రెండోసారి NDA అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. హోం మంత్రి అమిత్ షా CAAని అమలు చేయడంపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడో అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. ఫలితంగా వెనక్కి తగ్గింది కేంద్రం. కానీ...ఈ సారి ఇక వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. గతంలో ఈ చట్టం అమలు చేస్తామన్నప్పుడు జరిగిన అల్లర్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్ట్‌లనీ రూపొందించినట్టు హోంశాఖ వెల్లడించింది.