Dwarka Expressway Inauguration: ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలో దేశంలోనే తొలి ఎలివేటెడ్ హైవే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేని (Dwarka Expressway) ప్రారంభించారు. 8 వరుసల ఈ స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీ-గుడ్‌గావ్ మధ్య ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించనుంది. అంతే కాదు. ప్రయాణాన్నీ సులభతరం చేయనుంది. మొత్తం 19 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం కేంద్రం రూ.4,100 కోట్లు ఖర్చు చేసింది. హరియాణా సెక్షన్‌లో రెండు ప్యాకేజ్‌లున్నాయి. ఢిల్లీ హరియాణా బార్డర్ నుంచి బసాయ్ ROB వరకూ ఒకటి, బసాయ్ ROB నుంచి ఖేర్కీ దౌలా వరకూ మరోటి నిర్మించారు. మొత్తం 19 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే స్ట్రెచ్ హరియాణా పరిధిలో ఉండగా..దాదాపు 10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వే ఢిల్లీ పరిధిలో నిర్మించారు. ఈ మొత్తం స్ట్రెచ్‌ కోసం రూ.9 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై నాలుగు మల్టీ లెవెలె ఇంటర్‌ ఛేంజెస్ ఉంటాయి. టన్నెల్స్, అండర్‌పాస్‌లు నిర్మించారు. ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌తో పాటు ఫ్లైఓవర్ పై మరో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టారు. సింగిల్ పిల్లర్‌పై ఇంత పెద్ద ఎలివేటెడ్ రోడ్‌ని నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ద్వారకా సెక్టార్ 25లో ఉన్న India International Convention Centre (IICC) కి నేరుగా అనుసంధానిస్తోంది ఈ ఎక్స్‌ప్రెస్‌ వే. హైవే ప్రాజెక్ట్‌ల కోసం రూ.లక్ష కోట్లు కేటాయించిన మోదీ సర్కార్ అన్ని రాష్ట్రాల్లోనూ రహదారులు నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే ఈ హరియాణా ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించింది. ఇది Bharatmala Project లో భాగమే.






ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వేల కోట్ల విలువైన ఈ కీలక ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తుంటే కాంగ్రెస్‌కి, ఆ పార్టీ మిత్ర పక్షాలకు కడుపు మండిపోతోందని, వాళ్లు తట్టుకోలేకపోతున్నారని మండి పడ్డారు. వాళ్లకి కనీసం నిద్ర కూడా పట్టడం లేదంటూ సెటైర్లు వేశారు. పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు.


"లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించుకుంటుంటే కాంగ్రెస్‌కి ఆ పార్టీ మిత్ర పక్షాలకు కడుపు మంటగా ఉంది. కనీసం కంటి నిండా నిద్ర కూడా పోవట్లేదు వాళ్లు. ఈ ప్రాజెక్ట్‌లే వాళ్లకు సమస్య తెచ్చి పెడుతున్నాయి. కేవలం ఎన్నికల కోసమే నేను ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు. పదేళ్లలో భారత్‌ ఎంతో పురోగతి సాధించింది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు"


- ప్రధాని నరేంద్ర మోదీ