Red Line On Medicine Strips: ట్యాబ్లెట్ షీట్స్‌పైన రెడ్‌లైన్‌ని ఎప్పుడైనా గమనించారా..? అసలు రెడ్‌లైన్‌ ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా..? దీని గురించి అందరికీ తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మనం సొంత వైద్యం చేసుకుంటాం. అంటే...డాక్టర్ చెప్పకుండానే మనమే ఏదో ఓ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాం. అన్ని సార్లూ అది పని చేస్తుందని చెప్పలేం. ఒక్కోసారి అది సైడ్‌ ఎఫెక్ట్స్‌కి దారి తీయొచ్చు. కొన్ని సార్లు అది ప్రాణాలు తీసే ప్రమాదమూ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం X వేదికగా ఓ విషయం వెల్లడించింది. మెడిసిన్‌ ప్యాకింగ్‌ల వెనకాల ఉన్న ప్రతి డిటెయిల్‌నీ గమనించాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. అటు ఫార్మసిస్ట్‌లకూ కీలక ఆదేశాలిచ్చింది. ఎవరైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో వస్తేనే వాళ్లకి ఆ మందులు విక్రయించాలని తేల్చి  చెప్పింది. ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. మందులు అతిగా వాడడం వల్ల శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ తగ్గిపోతోందన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అంటే...ఎంత డోస్‌ ఉన్న యాంటీబయాటిక్స్ వేసుకున్నా ఆ వ్యాధి తొందరగా తగ్గదు. శరీరం క్రమంగా ఆ శక్తిని కోల్పోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెడిసిన్ కొన్నప్పుడు ప్యాక్‌ లేబుల్స్‌ని గమనించాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పుడే కాదు. 2016లోనూ కేంద్ర ఆరోగ్య శాఖ ఇదే విధంగా అప్రమత్తం చేసింది. రెడ్‌లైన్‌ ఉన్న మెడిసిన్‌ని వైద్యుల సలహా లేకుండా వాడొద్దని హెచ్చరించింది. 


"యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య నుంచి బయటపడాలంటే మెడిసిన్ కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. మెడిసిన్ స్ట్రిప్‌ వెనకాల రెడ్‌లైన్‌ ఉందంటే వైద్యుల సలహా లేకుండా వాటిని తీసుకోవద్దని అర్థం. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా వాటిని కొనుగోలు చేయకూడదు. దీంతో పాటు ఎక్స్‌పైరీ డేట్‌నీ ఓ సారి చూసుకోవాలి. సొంత వైద్యం అస్సలు పనికి రాదు. ఎలాంటి అనారోగ్యం అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. ఆయన సూచించిన మందులనే వాడాలి. ముఖ్యంగా రెడ్‌లైన్ ఉన్న మెడిసిన్‌ని వేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి"


- కేంద్ర ఆరోగ్య శాఖ 


 






ప్రపంచ దేశాల్లో యాంటీబయోటిక్స్‌ను అధికంగా వాడుతున్న దేశాల్లో మనదే మొదటి స్థానం. వీటిని వాడే పద్ధతి కూడా మన జనాభాకు సరిగా అవగాహన లేదు. అంతేకాదు యాంటీబయోటిక్స్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా మనదే. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దుకాణాల్లో యాంటీబయోటిక్స్ ను అడ్డదిడ్డంగా అమ్మేది కూడా మనమే. అందుకే ఆరోగ్య నష్టాలు మన జనాభాలోనే అధికంగా ఉన్నాయి. అవసరం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయోటిక్స్ వాడడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సాధారణ మందులకు లొంగాల్సిన బాక్టీరియా కూడా మన శరీరంలో జన్యు పరిణామాలకు లోనై శక్తివంతంగా తయారవుతుంది.