Andhra Pradesh News: విజయనగరం (Vizianagaram) జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (Tdp) సీనియర్ నేత ఆశోక్ గజపతి రాజు (Ashok Gajapathiraju), మాజీ ఎమ్మెల్యే గీత (Misala geetha) మధ్య వార్ నడుస్తోంది. విజయనగరం అసెంబ్లీ టికెట్ ను అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు (Aditi Gajapathi Raju)కు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. దీంతో అశోక్ గజపతిరాజు, మీసాల గీత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకు కారణం అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో పాటు తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా  ఆశోక్ గజపతి రాజు చేస్తున్నారని లోలోపల రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల తరువాత వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. 


గంటా శ్రీనివాసరావు అండతో మీసాల గీత దూకుడు 
2014లో అశోక్ గజపతి రాజు పార్లమెంట్ కు పోటీ చేయడంతో... విజయనగరం  మున్సిపల్ చైర్ పర్సన్ గా  పనిచేసిన మీసాల గీతకు టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా 2014లో తెలుగుదేశం పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీకి పోటీ చేసిన మీసాల గీత...తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో...విజయనగరం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాస రావు నియమించింది టీడీపీ. ఇద్దరూ ఒకే సామాజక వర్గం కావడంతో మీసాల గీతకు జిల్లాలో ఎదురే లేకుండా పోయింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు మీసాల గీత చెక్ పెట్టాయి. 2019 ఎన్నికల్లోనూ తనకే టికెట్ వస్తుందని మీసాల గీత భావించారు. అయితే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. 


టికెట్ రాకుండా చెక్ పెట్టిన అశోక్ గజపతిరాజు


2019 ఎన్నికల్లో అదితి గజపతిరాజు ఓటమికి మీసాల గీత కూడా ఓ కారణమని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన అదితి గజపతిరాజుక... మీసాల గీత మనస్ఫూర్తిగా సహకరించి ఉంటే....విజయం సాధించేవారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.  అదితి గజపతిరాజు ఓటమి తర్వాత మీసాల గీతకు, అశోక్ బంగ్లాకు మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయి. అశోక్ బంగ్లాలో నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో గీత కనిపించేది కాదు. బంగ్లాలోని టీడీపీ కార్యాలయానికి పోటీగా మీసాల గీత విజయనగరం సొంత కార్యాలయం పెట్టుకున్నారు. మీసాల గీత వేరు కుంపటి పెట్టుకోవడంతో...అశోక్ గజపతి రాజు సమయం కోసం వేచి చూశారు. 2024 ఎన్నికలో టిక్కెట్ కోసం ప్రయత్నించారు మీసాల గీత. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం అదితి గజపతిరాజుకు కేటాయించేలా అశోక్ పావులు కదిపారు. దీంతో గీత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 


విజయనగరం అసెంబ్లీ నుంచి ఆరు సార్లు విజయం
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మొదట్లోనే అశోక్ గజపతి రాజు...పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరం నియోజకవర్గం నుంచి  1983, 1985, 1989, 1994, 1999 వరకు తిరుగులేని విజయాలు సాధించారు. 2004లో ఓటమి పాలయిన అశోక్ గజపతి రాజు...2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన అశోక్ గజపతి రాజు...కేంద్ర మంత్రి వర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. విజయనగరం అసెంబ్లీ అంటే అశోక్ గజపతి రాజు....అశోక్ గజపతి రాజు అంటే విజయనగరం అనేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు.