Delhi Liquor Case: 


ప్రెస్‌కాన్ఫరెన్స్ 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ,ఈడీలపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసు పేరుతో టార్చర్ చేస్తున్నారని మండి పడ్డారు. మనీష్ సిసోడియాతో పాటు తననూ ఇబ్బంది పెట్టేందుకు అబద్ధపు అఫిడవిట్‌లు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా కొందరి పేర్లు ప్రస్తావించిన కేజ్రీవాల్...వాళ్లంతా వేధింపులకు గురవుతున్నట్టు చెప్పారు. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన...దర్యాప్తు సంస్థలు తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా మొబైల్‌ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల్నీ ఖండించారు. 


"మనీష్ సిసోడియా 14 ఫోన్‌లను ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. సాక్ష్యాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. కానీ ఈడీ సీజర్ మెమో ప్రకారం సిసోడియాకు చెందిన 4 ఫోన్లు అధికారుల వద్దే ఉన్నాయి. మరో ఫోన్ సీబీఐ వద్ద ఉంది. మిగతా ఫోన్‌లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అధికారులు వాటిని వాడుతున్నారు కూడా. సిసోడియా ఆ ఫోన్‌లను ధ్వంసం చేస్తే అవి అధికారుల చేతికి ఎలా వస్తాయి..? ఈ దర్యాప్తు సంస్థలే రూ.100 కోట్లు లంచం తీసుకున్నాయి. 400 చోట్ల కావాలనే తనిఖీలు చేపట్టాయి. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. "


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






అవినీతిపై తాను మాట్లాడినప్పుడే సీబీఐ తనకు సమన్లు జారీ చేస్తుందని ఊహించినట్టు చెప్పారు కేజ్రీవాల్. 


"ఢిల్లీ అసెంబ్లీలో నేను కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడే అనుకున్నాను నాకు కూడా నోటీసులు వస్తాయని. ఈ 75 ఏళ్ల దేశ చరిత్రలో మరే పార్టీని కూడా ఇలా టార్గెట్ చేయలేదు. మేం ఢిల్లీ ప్రజలకు ఎంతో నమ్మకమిచ్చాం. మెరుగైన విద్యనూ అందించాం. నిజానికి లిక్కర్ పాలసీ చాలా అద్భుతమైనది. అమల్లోకి వచ్చి ఉంటే అవినీతికి ఎండ్‌కార్డ్ పడేది. "


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి