ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. వారు బెయిల్ షరుతులు ఉల్లంఘించారన్న రఘురామకృష్ణరాజు వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించలేదు. రాజకీయ ఉద్దేశాలతోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారన్న జగన్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఆ పిటిషన్లను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్, విజయ సాయిరెడ్డిలకు ఊరట లభించినట్లయింది. Also Read : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !

  
జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏప్రిల్ ఆరో తేదీన రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదట పూర్తి వివరాలు లేవని సీబీఐ కోర్టు తిరస్కరించింది. తర్వాత ఏప్రిల్ 15న పూర్తి వివరాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 22న పిటిషన్ విచారణ అర్హతపై సీబీఐ కోర్టు విచారణ జరిపి విచారణ అర్హత ఉందని న్యాయస్థానం తేల్చింది.  ఏప్రిల్ 28న జగన్, సీబీఐలకు రఘురామ పిటిషన్ పై నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత సీబీఐ మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు చెప్పింది. రఘురామకృష్ణరాజు రాజకీయ కారణాలతోనే పిటిషన్ దాఖలు చేశారని .. ఆయనపై పలు కేసులు ఉన్నాయని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. Also Read : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న నేరాలు


పలు వాయిదాల విచారణ తర్వాత ఆగస్టు 25న తీర్పు ఇస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది. అదే సమయంలో ఆగస్టు 7వ తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేసిన సీబీఐ రెండు కేసుల తీర్పు సెప్టెంబర్ 15న ఇస్తామని తెలిపింది. అయితే జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో  బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టి వేశారని సాక్షి మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో సెప్టెంబర్ 14న హైకోర్టులో రఘురామ బెంచ్ మార్చాలన్న పిటిషన్‌ను ఎంపీ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో తీర్పు చెప్పడానికి మార్గం సుగమం అయింది. Also Read : యాత్రలతో ప్రజల్లోకి టీడీపీ అగ్రనేతలు
  
2010 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రో కో పేరుతో  తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకుని లబ్ది చేకూర్చాలని  హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది. 2011  ఆగష్టు 17న  ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీబీఐ విచారణ ప్రారంంభించింది. ఈ కేసులపై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా...దీనిని ఆధారంగా చేసుకుని ఈడి 9 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.  2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పట్నుంచి జగన్ షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్నారు. Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?


తన పిటిషన్లను కొట్టి వేయడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. తీర్పు కాపీని పరిశీలించిన తర్వాత ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని ప్రకటించారు. సాక్షిలో వచ్చిన వార్త నిజమని తేలిందని వ్యాఖ్యానించారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.