కెనడాలోని భారత దౌత్యవేత్తను అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై సోమవారం వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.


జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. ఇటీవల దిల్లీలో జరిగిన జీ 20 సమావేశాల సమయంలో కూడా కెనడా ప్రధాని ట్రూడో, ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కెనడాలో కెనడా పౌరుడి హత్య వెనుక విదేశీ హస్తం ఉంటే అది తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించడమే అని అన్నారు. ఆ కేసుకు సంబంధించిన విచారణకు సహకరించాలని ట్రూడో కోరారు. 


కాగా సోమవారం కెనడాలోని భారత ఇంటలిజెన్స్‌ హెడ్‌ను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. అంతేకాకుండా ఆరోపణలు నిజమని రుజువైతే తమ దేశ సార్వభౌమత్వానికి చాలా పెద్ద విఘాతమని ఆమె పేర్కొన్నారు.  ఇక ఇరు దేశాలు పరస్పరం ఎలా వ్యవహరించాలనే అంశంపై ఇది అత్యంత ప్రాథమిక నియమమని, దానిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆమె తెలిపారు. అలాగే ఇటీవల కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ మాట్లాడుతూ.. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన ట్రేడ్‌ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాలు రాజకీయ పరమైన సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే కెనడా భారత్‌తో వాణిజ్య చర్చల్లో పాల్గొంటుందని మంత్రి ప్రతినిధి శాంతి కొసెంటినో మీడియాకు వెల్లడించారు. అయితే కారణాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.


ఖలిస్థానీ అంశం వల్ల ఇప్పటికే భారత్‌, కెనడాల మధ్య జరగాల్సిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో దీనిపై చర్చ జరగాల్సి ఉండగా, కెనడా ప్రధాని ఈ చర్చలను నిలిపేశారు. కెనడాలోని కొన్ని రాజకీయ పరిణామాలపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని, అందువల్ల ఈ రాజకీయ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు చర్చలు నిలిపేస్తున్నట్లు కెనడా అధికారి తెలిపారు. రాజకీయ సమస్యలు పరిష్కరించిన తర్వాత తిరిగి చర్చలు జరుగుతాయని అన్నారు.


ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో కూడా భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అంటీముట్టనట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇరువురు మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరగలేదు. కేవలం ఒక  చిన్న సమావేశం మాత్రమే జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కు వేర్పాటు వాదులు అక్కడి నుంచి కార్యకలాపాలను నడిపిస్తున్నారని ఇది ఇరు దేశాలకు మంచిది కాదని అన్నారు. అక్కడ నివసిస్తున్న భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారని మోదీ ఆరోపించారు. అయితే ఆ సమావేశంలో ట్రూడో.. కెనడాలో విదేశీ జోక్యం జరుగుతోందని అది తమ దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడమని పేర్కొన్నారు. ఇలా ఇరుదేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.