Insurance Coverage for Building: 


హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ..


"అయ్యయ్యో అలా కూల్చేస్తున్నారేంటి..? అంత డబ్బు పెట్టి కట్టిన బిల్డింగ్‌లు బ్లాస్ట్ చేస్తే..ఆ నష్టం ఎవరు భరించాలి..? " నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత విషయంలో కొందరు ఇలానే బాధ పడ్డారు. అయితే...ఆ బిల్డింగ్‌పై రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని తెలిశాక కాస్త కుదుటపడ్డారు. ఇప్పుడిదే సమస్య మన బిల్డింగ్‌కీ వస్తే..? పొరపాటున ఏదైనా విపత్తు వచ్చి నష్టం జరిగితే..? ఏం భయపడాల్సిన పని లేదు. మన బిల్డింగ్‌లకూ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. విపత్తులు మనకేమీ చెప్పి రావుగా. కేరళ వరదలు, అంఫాన్ తుఫాన్, లాంటివిఉన్నట్టుండి విరుచుకుపడతాయి. అవే కాదు. భూకంపం వచ్చినా...మన కలల సౌధం మన కళ్ల ముందే కూలిపోతుంటే చూస్తూ తట్టుకోలేం. మళ్లీ మనం రీబిల్డ్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పైగా సెంటిమెంట్‌ కూడా దెబ్బ తింటుంది. అందుకే...బిల్డింగ్‌లకు ఇన్సూరెన్స్ చేయించుకోవటం బెటర్ అని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. దీన్నే హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (Home Shield Insurance Policy) అంటారు. ఓ సారి ఈ పాలసీ తీసుకుంటే...మన ఇల్లు ఎలాంటి విపత్తులకు గురైనా...కాస్తంత నిశ్చింతగా ఉండొచ్చు. మీరుండే ప్రాంతాన్ని బట్టి, అవి ఎంత డేంజర్‌ జోన్‌లో ఉన్నాయనే ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తారు. HDFC, ICICI సహా మరి కొన్ని సంస్థలు ఈ పాలసీని అందజేస్తున్నాయి. 


ఏరియాను బట్టి ప్రీమియం అమౌంట్..


ఒకవేళ మీ బిల్డింగ్‌ ప్రమాదం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటే, ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్డింగ్ పాతదైనా, నిర్మాణంలో ఏమైనా లోపాలున్నా అప్పుడు కూడా ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే...బిల్డింగ్‌కు అన్ని రకాల
సెక్యూరిటీ ఉంటే..ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటే...కట్టాల్సిన ప్రీమియం తక్కువగానే నిర్ణయిస్తారు. మరో విషయం ఏంటంటే...మీ బిల్డింగ్‌లో ఏమైనా విలువైన వస్తువులుంటే వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కాకపోతే...ఆ వస్తువులేంటి..? అవి ఎంత విలువ చేస్తాయి..? అనే దాన్ని బట్టి ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం నిర్దేశించిన సమయంలోనే బిల్డింగ్‌కు సంబంధించిన టోటల్ వాల్యూని లెక్కిస్తారు. బిల్డింగ్‌కు సంబంధించిన నిర్మాణ విలువ ఎంత పెరిగితే...అంత ప్రీమియం పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనం బైక్ ఇన్సూర్ చేసినప్పుడు IDV పెంచమంటాం. దానికి తగ్గట్టుగా ప్రీమియం కూడా పెరుగుతుంది. బిల్డింగ్‌ ఇన్సూరెన్స్ విషయంలోనూ ఇంతే అన్నమాట. మార్కెట్‌లో మీ బిల్డింగ్‌కు ఎంత వాల్యూ ఉందో లెక్కిస్తారు. ఒకవేళ ఇది ఎక్కువగానే ఉంటే...ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఎక్కువగానే వస్తుంది. సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకూ ఇన్సూర్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకూ ఈ పాలసీలో ఇన్సూర్ చేసుకోవచ్చు. అంతే కాదు. ఫర్నిచర్, జ్యూవెల్లరీకి కూడా ఇన్సూర్ చేయొచ్చు. 


లాంగ్‌టర్మ్ పాలసీలో డిస్కౌంట్‌లు


సాధారణంగా కొన్ని హౌజింగ్ సొసైటీలు దాదాపు అన్ని బిల్డింగ్‌లకూ ముందుగానే ఇన్సూర్ చేసేస్తాయి. అలాంటి సమయాల్లో మనం కేవలం మన ఇంట్లోని వస్తువులకు బీమా చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ హౌజింగ్ సొసైటీ వాళ్లు ఆ పని చేయకపోతే...మనమే సొంతగా మన బిల్డింగ్‌కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. పాలసీలోని నిబంధనల మేరకు బిల్డింగ్ డ్యామేజ్ అయితే...కచ్చితంగా ఆ అమౌంట్ వచ్చేస్తుంది. అయితే రూల్స్‌కి లోబడకపోతే మాత్రం ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. ఇది ఆయా కంపెనీలు అందించే పాలసీలను బట్టి ఉంటుంది. ఓ అసోసి యేషన్ పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నా...విడివిడిగా ఫ్లాట్‌లకూ ఈ బీమా వర్తిస్తుంది. అయితే...రెసిడెన్స్ నుంచి షాప్‌గా మార్చటం లాంటివి చేస్తే మాత్రం బీమా వర్తించదు. ఈ పాలసీ తీసుకున్నప్పుడు అది ఇల్లా లేదా కమర్షియల్ ప్లేసా అనేది క్లియర్‌గా చెప్పాలి. పాలసీ తీసుకున్నాక.. ఇందులో ఏమైనా మార్పులుంటే ఆ బీమా వర్తించదని గుర్తుంచుకోవాలి. ఏటా నిర్మాణ వ్యయం పెరుగుతూనే ఉంటుంది. కనీసం ఇది 10-15% మేర పెరుగుతుందని అంచనా. ఆ మేరకు మనకు వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెరుగుతుంది. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్‌, రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లలో మన ఏరియాలో కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు కూడా. లాంగ్‌టర్మ్ పాలసీ తీసుకున్న వాళ్లకు ఆయా కంపెనీలు డిస్కౌంట్‌లు కూడా ఇస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. మీరూ మీ బిల్డింగ్‌కు బీమా చేయించాలనుకుంటే ఓసారి మీకు నచ్చిన, నమ్మిన బ్యాంక్‌ను సంప్రదించండి.