BSNL Revival: 


BSNLసేవలు మెరుగుపరుస్తాం: కేంద్ర మంత్రి 


బీఎస్‌ఎన్‌ఎల్‌ BSNLను పునరుద్ధరించే పనిలో పడింది కేంద్రం. కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థను గట్టెక్కించే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లు కేటాయించనున్నట్టు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిధులు మూడు భాగాలుగా విభజించి మొత్తం మూడు రకాల సేవల్లో నాణ్యత తీసుకు రానున్ననట్టు స్పష్టం చేశారు. సేవల్ని మెరుగుపరచటం, బ్యాలెన్స్ షీట్‌ను సవరించటం, ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయటం లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవలు అందించేలా స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకూ సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. బ్యాలెన్స్‌ షీట్ సవరించేందుకు రూ.33,000 కోట్లను ఈక్విటీగా మార్చాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయ పడుతోంది. ఇంతే మొత్తంలో లో ఇంట్రెస్ట్ బాండ్స్‌తో బ్యాంక్‌ లోన్స్‌ను తిరిగి చెల్లించేందుకూ కసర్తతు జరుగుతోంది. పీటీఐ ప్రకారం చూస్తే...ఈ ఏడాది మే 31వ తేదీన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు మార్కెట్‌ షేర్‌లో 89.97% వాటా దక్కించుకోగా, ప్రభుత్వ రంగ సంస్థలైన BSNL,MTNL మాత్రం
10.13%కే పరిమితమయ్యాయి. జులై 19న ఈ వివరాలు వెల్లడించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).






స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవాలని జియో పట్టుదల


బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించటంతో పాటు, భారత్‌ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ BBNLలో BSNLను కలిపేందుకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 5G వేలంపైనా ఈ సందర్భంగా మాట్లాడారు. వేలం పెట్టిన రెండో రోజు రూ.1.49 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌ వచ్చాయని, ప్రస్తుతానికి ఈ బిడ్డింగ్‌కు సంబంధించి 9వ రౌండ్ కొనసాగుతోందని చెప్పారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయానికి 5G స్పెక్ట్రమ్‌ కోసం రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్స్ వచ్చాయని స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఈ స్పెక్ట్రమ్‌ను దక్కించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోయినా...జియో ఇందుకోసం రూ.80,100 కోట్లకు బిడ్ వేసిందని ICICI సెక్యూరిటీస్ తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.45,000 కోట్లకు బిడ్ వేసింది. అనుకున్న దాని కన్నా 20% ఎక్కువగా బడ్జెట్ కేటాయించింది ఈ సంస్థ. ఈ సారి ప్రభుత్వం మొత్తం 72 GHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. ఇందులో లోబ్యాండ్‌లో (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ బ్యాండ్‌లో (3300 MHz), హై బ్యాండ్‌లో 26 GHz ఉంటుంది.
5జీ టెక్నాలజీ ఆధారంగా టెలికం కంపెనీలు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. 


Also Read: Sai Priya Episode : సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌- బతకాలని ఉందంటూ పేరెంట్స్‌కు మెసేజ్‌