విశాఖలో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నానంటూ ఆడియో మెసేజ్ పంపించింది. తన కోసం వెతకొద్దని... అలా చేస్తే చచ్చిపోతానంటూ వార్నింగ్ ఇచ్చింది. తనకు బతకాలని ఉందని... వెతికితే మాత్రం తన ప్రియుడితో కలిసి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించింది. 


రెండు రోజుల క్రితం విశాఖ ఆర్కేబీచ్‌లో సాయిప్రియ అదృశ్యమైంది. బీచ్ చూడటానికి వచ్చిన తన భార్య సముద్రంలో గల్లంతైందోమో అని పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో అలెర్ట్‌ అయిన పోలీసులు, నేవీ సిబ్బంది సముద్రంలో గాలింపు చేపట్టారు. హెలికాప్టర్లను ఉపయోగించి జల్లెడ పట్టారు. 


గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్న టైంలోనే సాయిప్రియ బెంగళూరులో ఉందని సమాచారం తెలిసింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమె చేసిన పనికి అంతా తిట్టుకున్నారు. బెంగళూరులో ఎక్కడ ఉందో అని గాలింపును ముమ్మరం చేశారు.


ఈ వెతుకులాట సాగుతుండగానే... తల్లిదండ్రులకు సాయిప్రియ వాట్సాప్ మెసేజ్‌లు పంపించింది. తాను బెంగళూరులో ప్రియుడితో క్షేమంగా ఉన్నానని చెప్పింది. వెతకొద్దంటూ ప్రాధేయపడింది. బెంగళూరులో ప్రియుడితో పెళ్లి కూడా జరిగిపోయిందని మెడలో తాళిబొట్టుతో ఉన్న ఫొటోలను కూడా పంపింది. 


ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న రవినే పెళ్లి చేసుకున్నానని... ఆయనతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు వాయిస్‌ మెసేజ్ పంపింది. వెతికితే మాత్రం కచ్చితంగా ఇద్దరం కలిసి చనిపోతామని బెదిరించింది. తాను ఈ నిర్ణయం తీసుకోవడంలో రవి, వాళ్ల పేరెంట్స్ ప్రమేయం లేదని చెప్పింది. వారిని వేధించొద్దని అభ్యర్థించింది. తన కోసం వెతికి టైం వేస్ట్ చేసుకున్న అధికారులకు క్షేమాపణలు చెప్పింది సాయిప్రియ. 


సోమవారం సముద్రంలో గల్లంతైందన్న ఫిర్యాదుతో సాయి ప్రియను వెతికేందుకు అధికార యంత్రాంగమంతా సముద్రతీరానికి చేరుకుంది. ఏకంగా నగర మేయర్ హరి వెంకట కుమారి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నేవీ అధికారులు హెలికాప్టర్, బోట్లు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా గాలింపు చర్యలు జరుగుతుండగానే సాయిప్రియ తాను ప్రియుడితో వెళ్లిపోయినట్టు సమాచారం అందించి అందర్నీ షాక్‌కి గురి చేశారు. 


వైజాగ్ బీచ్‌లో సోమవారం రాత్రి మిస్సయిన సాయి ప్రియ ముందు నెల్లూరులో ఉన్నట్టు బంధువులు గుర్తించారు. పెళ్లిరోజు వైజాగ్ బీచ్‌లో భర్త ఫోన్ చూస్తుండగా ప్రియుడితో జంప్ అయినట్టు తేల్చారు. భర్త మాత్రం తన భార్య సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న భ్రమలో అందరికీ సమాచారం ఇచ్చారు. కానీ సాయి ప్రియ మాత్రం నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం సాగిస్తుందని తర్వాత బంధువులు గ్రహించారు. ఈ జంట అక్కడ ఉంది.. ఇక్కడ ఉందని రోజంతా పుకార్లు నడిచాయి. చివరకు సాయంత్రానికి సాయిప్రియ తన పేరెంట్స్‌కు క్షేమంగా ఉన్నట్టు సమాచారం పంపించింది.