Opposition Reacts to Budget 2023: 


ప్రతిపక్షాల విమర్శలు..


కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు భగ్గమంటున్నాయి. ఇదో జుమ్లా బడ్జెట్ అంటూ మండి పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్దు రూపొందించారని విమర్శించారు. తనకో అరగంట సమయం ఇస్తే..ఇంతకన్నా మంచి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొస్తాననిసెటైర్లు వేశారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడిన మమతా...ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని...పేదలకు దీని వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ శ్లాబ్‌లలో మార్పులు చేయడం 
వల్ల ఎవరికీ ఉపయోగం లేదని స్పష్టం చేశారు. 


"ఈ బడ్జెట్ కేవలం అవకాశవాదాన్ని సూచిస్తోంది.  ఇది ప్రజా వ్యతిరేకమే కాదు. పేదలకూ ప్రయోజనం చేకూర్చని పద్దు. కేవలం ఓ వర్గ ప్రజలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ లేదు. కేవలం 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్. ఇది ప్రజలకు ఎలాంటి నమ్మకమూ ఇవ్వదు" 


-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బడ్జెట్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఇదో ఎన్నికల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు.


"ఇది కేవలం రెండు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బడ్జెట్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలేవీ ఇందులో కనిపించలేదు. ఉద్యోగ కల్పన అంశమూ లేదు. పేదలకు సంబంధించిన అంశాలేవీ లేవు" 


మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 
 
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చారని కొనియాడారు. అన్ని వర్గాలకూ ఏదో విధంగా లబ్ధి చేకూరాలే జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. దాదాపు గంటన్నర పాటు సాగిన నిర్మలా సీతారామన్ ప్రసంగం మొత్తాన్ని విన్నానని, సందర్భం వచ్చినప్పుడు దానిపై మాట్లాడతానని స్పష్టం చేశారు ఫరూక్ అబ్దుల్లా. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ కేంద్ర పద్దుపై పెదవి విరిచారు. 


"గత బడ్జెట్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలకు చేసిన కేటాయింపులు కాస్త మెరుగ్గానే అనిపించాయి. కానీ...అసలు నిజం ఇవాళ బయటపడింది. గతంతో పోల్చుకుంటే ఈ రంగాల్లో ఈ సారి చేసిన కేటాయింపులు చాలా తక్కువ" 


-జైరాం రమేశ్, కాంగ్రెస్ లీడర్ 


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై అసహనం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపించలేదని అన్నారు. పీడీపీ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. గత 8-9 ఏళ్లుగా ఇదే పద్దుని ప్రవేశ పెడుతున్నారని విమర్శించారు.


"పన్నులు పెంచారు. సంక్షేమం కోసం కేటాయించిన నిధులూ పెద్దగా లేవు. బడా బిజినెస్‌మేన్‌ల కోసమే ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు. కొన్ని సంక్షేమ పథకాలన్నీ తొలగిస్తున్నారు. దారిద్ర్య రేఖకు 
ఎగువన ఉన్న వాళ్లు..మళ్లీ దిగువకు జారిపోతున్నారు" 


మెహబూబా ముఫ్తీ 


Also Read: Budget 2023: 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్'- బడ్జెట్ లో మహిళల కోసం ప్రత్యేక పథకం