Railway Budget 2023:
భారీ కేటాయింపు..
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే రంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు దక్కాయి. రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది మోడీ సర్కార్. రైల్వే మినిస్ట్రీకి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ అందించడం ఇదే తొలిసారి. 2013లో చేసిన కేటాయింపుల కన్నా ఇది 9% అధికం. ఈ ప్రకటన చేసిన కాసేపటికే...రైల్వే సంబంధింత కంపెనీల షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, IRCON ఇంటర్నేషనల్ షేర్‌లు కళకళలాడాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రైల్వేకు రూ. లక్ష 40 వేల కోట్ల నిధులు కేటాయించారు. అప్పుడే నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లలో భారత్ 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తుందని ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కనుక అందరూ ఆసక్తి కనబరిచారు. రైల్వే రంగానికి సంబంధించి లక్ష్యానికి అనుగుణంగా భారీ కేటాయింపులు చేసింది మోడీ సర్కార్.
రక్షణ, వ్యవసాయ రంగాల్లోనూ..
ఇక చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌నూ సుమారు 70 వేల కోట్ల రూపాయల మేర పెంచింది. 2023-24కి గాను ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.5.94 లక్షల కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో ఎక్కువ భాగం జవాన్లకు అవసరమైన ప్రాథమిక అభివృద్ధికే వినియోగిస్తారు.2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం భద్రత బడ్జెట్‌ను 9.86 శాతం పెంచింది. ఆర్మీ సిబ్బంది జీతాలు, ఇతర రక్షణ వ్యయాలను పెంచడానికి ప్రభుత్వం ఎక్కువగా 2022 బడ్జెట్‌లో 47 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 2022-23లో రక్షణ బడ్జెట్ రూ.5.25 లక్షల కోట్లు. ఈ బడ్జెట్ లో మంత్రి వ్యవసాయ రంగానికీ పెద్దపీట వేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 28 నెలల్లో80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని చెప్పారు. వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్ వ్యవసాయ స్టార్టప్ లను పెంచుతుంది. ఇది రైతులకు సహాయం చేస్తుంది. దీనివలన రైతులు, రాష్ట్రం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఉంటుంది.