అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పటికే ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీయడంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా విచారణ చెయ్యాలని జగన్ సర్కార్ భావిస్తుంది. దీంతో హోం శాఖ అధికారులు సచివాలయంలో ఈ వ్యవహరంపై అంతర్గంగా సమావేశం అయ్యారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలు, బయటకి వచ్చిన ఆడియో టేపుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అటు పార్టీ పరంగా కోటంరెడ్డికి కౌంటర్ అటాక్ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై కూడా అధికార యంత్రాంగంతో కూడా విచారణ చేయించడం ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తుంది.


అవసరమైతే థర్డ్ పార్టీ విచారణ:


అటు ప్రభుత్వాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దలతో పాటు అటు అధికార యంత్రాంగంతో ఆరాతీయించే పనిలో ఉన్నారు. కోటంరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు పరిశీలించడంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోలు కూడా క్షుణ్నంగా పరిశీలించి, ఫోన్ ట్యాపింగ్ పేరుతో  ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీలో చేరతానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ రికార్డింగ్ లు బయటికి రావడంతో కుట్రలో భాగమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. విచారణలో థర్డ్ పార్టీతో ఎంకైరీ  చెయ్యించాలని, అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ చెయ్యించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇవి అన్నిసాధ్యం కానీ పక్షంలో కేంద్ర ప్రభుత్వంలో పదవీ విమరణ చేసిన అధికారులతో నైనా ఈ విషయంపై అంతర్గతంగా విచారణ చేయిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని కుట్రలో ఎవరి భాగం ఎంత అన్నది కూడా తెలుస్తుందని సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తుంది.


సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు:


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజు రోజు కు కోటంరెడ్డి దూకుడు పెంచడంతో సీఎంవో నుంచి కూడా ఈ అంశంపై ఆరాతీస్తున్నారు. మంత్రులతో పాటు కేంద్ర పార్టీ కార్యాలయం వేదికగా నేతలతో సీఎంవో అధికారులు మాట్లాడడంతో పాటు పోలీస్, నిఘా వర్గాల నుంచి కూడా సీఎంవో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా గా కోటంరెడ్డి ఐఏఎస్ అధికారులను  కూడా ఇన్వాల్వ్ చెయ్యడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది.