Budget 2023: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై ప్రత్యేక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటివరకు దేశంలో గ్రామీణ మహిళలను 81 లక్షల స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశామని.. రానున్న రోజుల్లో మరింత మంది మహిళలను చేర్చుకునే యోచనలో ఉన్నామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఈ బడ్జెట్ లో మహిళల కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ 'మహిళా సమ్మాన్ పొదుపు లేఖ' (మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్) పథకాన్ని ప్రకటించారు. బడ్జెట్‌లో మహిళలకు ఇది అతిపెద్ద ప్రకటన. ఈ పథకం కింద మహిళలెవరైనా 2 సంవత్సరాలు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి. మెచ్యురిటీ అనంతరం ఆ సొమ్ముతో పాటు వడ్డీని ప్రభుత్వం మహిళలకు అందిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్ పథకం
- దేశంలోని మహిళలు, బాలికలు ఎవరైనా ఈ పథకం కింద ఖాతా తెరవచ్చు.
- 2 సంవత్సరాలు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి
- మెచ్యురిటీ అయ్యాక ఆ సొమ్ముకు 7.5 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తుంది.
- మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఒకవేళ డిపాజిట్ చేసిన మహిళ మరణిస్తే నామినీకి ఆ డబ్బును అందిస్తారు.
- నిబంధనలు, షరతులు ప్రకారం అకౌంట్ ఓపెన్ చేయాలి.
ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు, మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. స్వావలంబన దిశగా మహిళలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ స్కిల్ హానర్ స్కీమ్ కింద మరింతమందిని తీసుకురావడం గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
- వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్ లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువ పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి- స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తారు.
- అమృత్ కాల్ కోసం బలమైన పబ్లిక్ ఫైనాన్స్, బలమైన ఆర్థిక రంగం, సాంకేతికతతో నడిచే విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం సాధించడం కోసం సబ్ కా సాథ్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో రానున్నారు.
- వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నారు. దీనిపై బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాల ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ఆర్థికాభివృద్ధికి మంచిది. గ్రేటర్ డిజిటలైజేషన్ రుణాల ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. అని అన్నారు.
- హైదరాబాద్‌లోని మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని సీతారామన్ స్పష్టంచేశారు.
- ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్ల అవసరంపై అవగాహన కల్పించడం, ధాన్యం ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యం.