Budget 2023-24:
ఆ నిపుణులతో మీటింగ్‌లు..
వచ్చే ఏడాది బడ్జెట్‌పై (Budget 2023-24) ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా ప్రీబడ్జెట్ మీటింగ్‌లు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తొలివిడత సమావేశాల్లో భాగంగా...ముందుగా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తోపాటు వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న నిపుణులు, ఇన్‌ఫ్రా రంగంలోని నిపుణులతో చర్చించనున్నారు. నేటి (నవంబర్ 21) నుంచే ఈ ప్రీబడ్జెట్ మీటింగ్స్ మొదలవనున్నాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ కూడా చేసింది. వర్చువల్‌గా స్టేక్‌హోల్డర్స్‌తో చర్చలు జరపనున్నట్టు వెల్లడించింది. 2023-24కి సంబంధించిన బడ్జెట్‌పై విలువైన సలహాలు, సూచనలు అడగనుంది. "ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీబడ్జెట్ కన్సల్టేషన్ మీటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇండస్ట్రీ లీడర్స్‌తో చర్చలు జరపనున్నారు" అని ట్వీట్ చేసింది. దాదాపు నాలుగు రోజుల
పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏడుసార్లు విభిన్న రంగాలకు చెందిన నిపుణులతో చర్చించి తుది బడ్జెట్‌కు రూపకల్పన చేయనున్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులతోనూ చర్చలను జరగనున్నాయి. ఇక ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుద్ధ్య రంగాలకు చెందిన వాళ్లతోనూ నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరుపుతారు. నవంబర్ 28న ట్రేడ్ యూనియన్స్‌తో మీటింగ్ నిర్వహిస్తారు.
పన్ను ఆదాయంపై వ్యాఖ్యలు..
ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అందుకే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో 42% మేర రాష్ట్రాలకు అంద జేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని 41%కి తగ్గించాం. ఇందుకు కారణం...జమ్ము, కశ్మీర్‌ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించడమే. బహుశా భవిష్యత్‌లో ఎప్పుడైనా జమ్ము, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుండొచ్చు" అని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులు పంచుతున్నట్టు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ప్రధాని నరేంద్ర మోదీ మరో ఆలోచన లేకుండా అంగీకరించారని తెలిపారు. 2014-15లో 42% ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని, అప్పటికి అది 32% మాత్రమే ఉందని గుర్తు చేశారు. "ఆర్థిక సంఘం 42% రాష్ట్రాలకు పంచాలని సిఫార్సు చేసింది. అంటే...కేంద్ర ఖజానాలో నిధులు తగ్గిపోతాయి.
అయినా..ప్రధాని మోదీ వెనకాడలేదు. ఆ సిఫార్సులను అమలు చేసేందుకే మొగ్గు చూపారు" అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. "మీరు పన్ను రూపంలో కట్టే ప్రతి రూపాయినీ నా రూపాయిలాగే జాగ్రత్త పరుస్తాను. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నాది. వాటిని వేరే పనుల కోసం దారి మళ్లించడం సరికాదు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ నినాదాన్ని గుర్తుంచుకోవాలి" అని అన్నారు.
Also Read: హాజీపూర్‌లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు చిన్నారులు సహా 15 మంది మృతి