Karimnagar News: సమాజంలోని కొన్ని వృత్తుల్లో ఒత్తిడి అత్యంత తీవ్రంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో పోలీసు శాఖ ఒకటి. సంవత్సరాంతం డ్యూటీకి అందుబాటులో ఉండే విధంగా పోలీసు సిబ్బందికి ఆదేశాలు ఉంటాయి. కిందిస్థాయి హోంగార్డు మొదలుకొని పోలీస్ కమిషనర్ వరకు ఎవరికీ కూడా సరైన విశ్రాంతి ఉండదనేది కఠోర వాస్తవం. జనాభాకు తగ్గ పోలీస్ సిబ్బంది లేకపోవడమే దీనికి కారణమని పలుమార్లు నిపుణుల నివేదికలు వచ్చినప్పటికీ వ్యవస్థలో ఆశించినంత మార్పులు మాత్రం రాలేదు. దీంతో ఒత్తిడి కారణంగా పోలీసు సిబ్బందిలో పలు రకాల వ్యాధులు మొదలవుతున్నాయి. ఇక వారికి వచ్చే ప్రమోషన్లు కొత్త సమస్యలను తీసుకొస్తున్నాయి.
నిజానికి 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు ఒక రకంగా కింది స్థాయి సిబ్బందికి సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ అప్పటికే వరుస డ్యూటీల కారణంగా శరీరం సహకరించే పరిస్థితి ఉండదు. దీంతో పాటు 24 గంటలు అప్రమత్తంగా ఉండడం నేరాల ఛేదనలో వ్యక్తిగతంగా తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం కూడా వారిని అనారోగ్యానికి కారణం అయ్యేలా చేస్తోంది. నిజానికి ఒకసారి పదోన్నతి వచ్చిన తర్వాత ఆరు వారాలపాటు శిక్షణ ఇస్తారు. స్థానికంగా ఉండే పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ కొనసాగుతుంది.
గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచడంతో ఆ వయసులో సైతం ఇంక్రిమెంట్ల కోసమో.. ప్రమోషన్ ద్వారా వచ్చే హోదా కోసం హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ని వదులుకోవడం లేదు. ఇతర ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఉరుకులు పరుగులతో కూడిన డ్యూటీ కారణంగా శరీరం సైతం సహకరించదు. అలాంటి వారికి ఏకంగా 42 రోజులపాటు వివిధ శారీరక అంశాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల కొందరు దీనిని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు.
ఉదయం 5.30 గంటల నుంచి మొదలయ్యే ఈ శిక్షణలో మెడిటేషన్, వాకింగ్, యోగా వంటి వివిధ రకాల అంశాలు ఉంటాయి. ఇక వీటితోపాటు పోలీసు చట్టాలు ల్యాండ్ ఆర్డర్ విపన్ మేనేజ్మెంట్ ఎఫ్.ఐ.ఆర్, చార్జ్ షీట్ వంటి సాంకేతిక అంశాల్లో నిపుణుల చేత శిక్షణ ఇస్తారు. చివర్లో పరీక్ష నిర్వహించి అందులో పాసైన వారికే ప్రమోషన్ ఇస్తారు. అయితే ఆ వయసులో శిక్షణ పొందడానికి ఆసక్తి చూపింనప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు అనేది వాస్తవం. ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చిన వారిలో 50 ఏళ్లు నిండిన వారే 90% వరకు ఉన్నారు. 2017 వ సంవత్సరంలో ముగ్గురు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అందులో ట్రైనీ ఎఎస్ఐ మీర్జా సమీయుల్లా ఉండగా హైదరాబాద్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్, యాదవరావు మరో ట్రైనింగ్ ఎస్సై శంకర్ రావులు శిక్షణ సమయంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల సైతం శిక్షణకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అయితే పోయిన వారం రాజ నరేందర్ అనే మరో హెడ్ కానిస్టేబుల్ శిక్షణ సమయంలో మృతి చెందడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.
అయితే ప్రమోషన్ తర్వాత శిక్షణ అనేది తప్పనిసరి.. అని చట్టపరమైన అంశాలతో పాటు శారీరకంగా ఫిట్ నెస్ తోనే ఉంటేనే సిబ్బంది సరైన విధంగా విధులు నిర్వహించగలుగుతారని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ వి సునీత మోహన్ అంటున్నారు. అయితే బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు శిక్షణలో పాల్గొంటున్నారని.. వీరికి ఎలాంటి కఠినమైన శిక్షణ ఇవ్వడం లేదని స్పష్టం చేస్తున్నారు.