BRS Party:


అద్దెకు తీసుకున్న బిల్డింగ్ నుంచి..


తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చేస్తూ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై TRS..BRSగా ఎన్నికల బరిలోకి దిగుతుందని జాతీయస్థాయిలో చక్రం తిప్పుతామని స్పష్టం చేశారు. అయితే...ఇప్పటికే ఢిల్లీ వేదికగా BRS పార్టీ కార్యకలాపాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని అద్దెకు తీసుకున్న ఓ బిల్డింగ్ నుంచి పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సర్దార్ పటేల్ మార్గ్‌లోని ఓ బిల్డింగ్‌ను రెంట్‌కు తీసుకున్నారని అంటున్నారు. ఇలా అద్దె భవనంలో కాకుండా శాశ్వతంగా BRSకి ఓ బిల్డింగ్‌ ఉండాలని భావిస్తున్నారట. అందుకే...వసంత్ విహార్‌లో ఓ బిల్డింగ్‌ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ నిర్మాణం పూర్తయ్యే లోగా తాత్కాలికంగా ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారట. గతేడాది వసంత్ విహార్‌లో BRS ఆఫీస్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన మంత్రులు, ఎంపీల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్న తొలి పార్టీ తమదేనని BRS చెబుతోంది. అంతే కాదు. దేశ రాజధానిలో 1,110 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఓ కార్యాలయాన్నీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఉన్నట్టుగానే...ఢిల్లీలోనూ అదే తరహాలో తెలంగాణ భవన్‌ను నిర్మించనున్నారు. అయితే...దీనికి ఇంకా సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌ను మూడంతస్తులుగా నిర్మించనున్నారు. కాన్ఫరెన్స్ హాల్‌, లైబ్రరీ, ఆడియో విజువల్ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ తెలంగాణ భవన్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది పార్టీ. 


టార్గెట్ కర్ణాటక..


విజయదశమి సందర్భంగా సర్వసభ్య సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ పేరు మార్చుతూ తీర్మానం చేశారు. అంతే కాదు. ఇందుకోసం పార్టీ రాజ్యాంగంలోనూ కొన్ని సవరణలు చేశారు. పేరు మార్చిన మరుసటి రోజు ఎన్నికల సంఘానికి TRS లేఖ పంపింది. తమ పార్టీ పేరుని BRSగా మార్చాలని తెలిపింది. ఈ మేరకు ఎంపీ బి.వినోద్ కుమార్ ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి పార్టీ పేరు మార్చిన తీర్మానాన్ని సమర్పించారు. భారత రాష్ట్ర సమితి మొదటి టార్గెట్‌గా కర్ణాటకను ఎంపిక చేశారు కేసీఆర్. దీనికి కారణం ఉంది. వచ్చే ఏడాదే కర్ణాటకకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏడాది చివరిలో జరుగుతాయి. అంత కంటే ముందు కర్ణాటకలో జరుగుతాయి. అందుకే తెలంగాణ కంటే ముందే భారత రాష్ట్ర సమితిని కర్ణాటకలో అధికారం లోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం దేవేగౌడ పార్టీ జనతాదళ్ సెక్యూలర్‌తో కలిసి పోటీ చేయనున్నారు భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేసేందుకు కమారస్వామి సిద్ధంగా ఉన్నారు. ఆయన దేవేగౌడ కుటుంబం మొత్తం కలిసి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనకు వచ్చారు. కుమారస్వామి కుమారుడు .. సినీ హీరో అయిన నిఖిల్ గౌడ కూడా ప్రగతి భవన్‌లో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ స్వయంగా ఆయనకు టిఫిన్ వడ్డించారు. 


Also Read: Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా