MSCI India Index: ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో మార్పులు జరగబోతున్నాయి. కొన్ని పేర్లు కొత్తగా ఈ లిస్ట్‌లో చేరుతుంటే, మరికొన్నింటికి చెల్లుచీటీ ఇవ్వబోతున్నారు. లిస్ట్‌లోకి వచ్చిన స్టాక్స్‌లోకి ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెరుగుతాయి. అదే విధంగా, లిస్ట్‌ నుంచి ఎగ్జిట్‌ అయిన పేర్ల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లిపోతాయి.


గ్లోబల్ ఇండెక్స్ సర్వీసెస్ ప్రొవైడర్ MSCI, ఏడాదికి రెండుసార్లు (ఆరు నెలలకు ఒకసారి) MSCI India Indexలో మార్పులు చేస్తుంది. థ్రెషోల్డ్‌ కంటే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న స్టాక్స్‌ను కొత్తగా ఇండెక్స్‌లోకి చేర్చడం, మార్కెట్‌ విలువ తగ్గిన వాటిని ఇండెక్స్‌ నుంచి తప్పించడం చేస్తుంది.
 
నవంబర్‌లో, MSCI సెమీ యాన్యువల్‌ రివ్యూ ఉంది. ఆరోగ్యకమైన ర్యాలీలతో మార్కెట్‌ విలువలు పెంచుకున్న ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ (Tube Investment), ఏబీబీ ఇండియా (ABB India), వరుణ్ బెవరేజెస్ (Varun Beverages), బజాజ్ హోల్డింగ్స్ ‍‌(Bajaj Holdings), ఇండియన్ హోటల్స్ (Indian Hotels) ఈసారి MSCI India Indexలోకి ఎక్కే అవకాశం ఉంది. 


ఇండియన్‌ ఇండెక్స్‌లో జరిగే మార్పులను నవంబర్ 10న MSCI ప్రకటిస్తుంది. నవంబర్ 30 మధ్యాహ్నం తర్వాత ఈ సర్దుబాట్లు అమల్లోకి వస్తాయి.


1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
MSCI India Indexను ట్రాక్‌ చేసే గ్లోబల్‌ పాసివ్‌ ఫండ్స్‌ ఈ మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇండెక్స్‌లోకి కొత్తగా ఎంటరయ్యే స్టాక్స్‌లోకి కొత్తగా సుమారు 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్నది ఎక్స్‌పర్ట్‌ల అంచనా. ఇదే రీతిలో, ఎగ్జిట్‌ అయిన కౌంటర్ల నుంచి పెట్టుబడులు ఖాళీ అవుతాయి.


గత ఆరు నెలల కాలంలో  65% ర్యాలీ చేసిన ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియాలోకి సుమారు 200 మిలియన్‌ డాలర్ల ఇన్‌ ఫ్లో ఉంటుందని అంచనా. 


ఇండియన్ హోటల్స్‌లోకి 190 మిలియన్ డాలర్లు, వరుణ్ బెవరేజెస్‌లోకి 180 మిలియన్‌ డాలర్ల ఇన్‌ ఫ్లోలను చూడవచ్చు. గత ఆరు నెలల కాలంలో ఇండియన్ హోటల్స్ షేర్లు 36% లాభపడగా, వరుణ్ బెవరేజెస్ 76% పెరిగింది. 


ఆటో స్టాక్స్ అశోక్ లేలాండ్ (Ashok Leyland), టీవీఎస్‌ మోటార్స్‌లోకి (TVS Motors) వరుసగా 163 మిలియన్ డాలర్లు, 140 మిలియన్ డాలర్లు కొత్తగా రావచ్చని మార్కెట్‌ ట్రాకర్లు లెక్కలు వేశారు.


గుజరాత్ ఫ్లోరోకెమికల్స్‌ ‍‌(Gujarat Fluorochemicals) ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌కు ఇచ్చిన కట్-ఆఫ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ స్టాక్‌ కూడా లిస్ట్‌లోకి ఎక్కే అవకాశం ఉందని IIFL సెక్యూరిటీస్ విశ్వసిస్తోంది. 


బజాజ్ హోల్డింగ్స్, ఏబీబీ ఇండియా, ఆస్ట్రల్ (Astral), స్కేఫ్లర్ ఇండియా ‍‌(Schaeffler India), హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు (Hindustan Aeronautics) కూడా MSCI స్టాండర్డ్ ఇండెక్స్‌లో చేరే ఛాన్సెస్‌ ఉన్నాయి. వీటిలోకి 115 మిలియన్ డాలర్ల నుంచి 143 మిలియన్‌ డాలర్ల వరకు ఇన్‌ ఫ్లోస్‌ వచ్చే అవకాశం ఉంది.


ఎగ్జిట్‌ అయ్యే స్టాక్స్‌
గత ఆరు నెలల కాలంలో ఫ్లాట్‌గా ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ (Indraprastha Gas), దాదాపు 17% క్షీణించిన బయోకాన్‌ను (Biocon) ఇండెక్స్ నుంచి తప్పించే అవకాశం ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.