Sebi Brickwork Ratings: ఏదైనా కంపెనీ తప్పు చేస్తే సాధారణంగా జరిమానాలతో సరిపెట్టే మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (SEBI), ఈసారి అసాధారణంగా వ్యవహరించింది. చేసిన నిర్వాకం చాలు, ఇక దుకాణం సర్దేయమంటూ.. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను (Brickwork Ratings) ఆదేశించింది. ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి ఉండాల్సిన నైపుణ్యం, శ్రద్ధ బ్రిక్‌వర్క్‌కు లేవని ఆ కంపెనీ మొహం మీదే చెప్పేసింది. ఆ సంస్థ లైసెన్స్‌ క్యాన్సిల్‌ చేసింది. 


కొట్టు కట్టేయడానికి బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఆరు నెలలు గడువిచ్చింది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌తో బ్రిక్‌వర్క్ రేటింగ్స్ కథ కంచికి చేరుతుంది.


సెబీ ఇలాంటి ఘాటైన నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా అరుదు. ఏదైనా కంపెనీ హద్దు మీరితే హెచ్చరికలు లేదా జరిమానాలతోనే దాదాపుగా సరిపెట్టేస్తుంది. కానీ, లైసెన్స్‌ రద్దు చేయడంతో మొత్తం మార్కెట్‌ ఆశ్చర్యపోతోంది. 


కొత్త వ్యాపారంపైనా నిషేధం
బ్రిక్‌వర్క్ రేటింగ్స్‌ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను రద్దు చేయడమే కాదు, ఆ కంపెనీ కొత్త వ్యాపారం చేయకుండా కూడా నిషేధం విధించింది.


ఈ కంపెనీ పనితీరులో పదేపదే లోపాలు బయటపడ్డాయి. దీంతో, రిజర్వ్‌ బ్యాంక్‌తో (RBI) కలిసి 2020 నుంచి మూడు సార్లు ఈ కంపెనీ పనితీరు మీద సెబీ తనిఖీలు చేపట్టింది. ఆ తనిఖీల ఆధారంగా కొన్ని మార్పులు సూచించింది, జరిమానాలు కూడా విధించింది. అయినా సదరు సంస్థ పనితీరులో మార్పు రాకపోవడంతో, కంపెనీ కట్టేసి ఇంట్లో కూర్చోమని తాజాగా ఆదేశాలిచ్చింది.


కొన్ని కంపెనీలు జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల డిఫాల్ట్‌ను గుర్తించడంలో జాప్యం, ఆయా కంపెనీలను 'డిఫాల్ట్'కి డౌన్‌గ్రేడ్ చేయడంలో వైఫల్యం, డిఫాల్ట్‌ పేమెంట్స్‌ గురించి సమాచారం అందుకున్న తర్వాత కూడా రేటింగ్‌ మార్చకపోవడం వంటివి ఈ బ్రిక్‌వర్క్‌ నిర్వాకాల్లో కొన్ని.


వడ్డీ లేదా అసలు రీపేమెంట్ల షెడ్యూల్‌ను ట్రాక్ చేయడానికి సరైన యంత్రాంగం బ్రిక్‌వర్క్‌ దగ్గర లేకపోవడాన్ని కూడా సెబీ ఎత్తి చూపింది. సున్నితమైన అంశాల మీద నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన యంత్రాంగం లేకుండా మీరు ఇచ్చే రేటింగ్స్‌ను ఎందుకు నమ్మాలంటూ ప్రశ్నించింది.


9,000 రేటింగ్స్‌
బ్రిక్‌వర్క్ రేటింగ్స్‌ ఇచ్చిన దాదాపు 9,000 రేటింగ్స్‌ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ సెబీ పరిశీలిస్తోంది. వీటిలో బ్యాంక్ లోన్ రేటింగ్స్‌, సెక్యూరిటీలు, ఇన్‌స్ట్రుమెంట్‌ల రేటింగ్స్‌ కూడా ఉన్నాయి.


ALSO READ: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.