Telugu breaking News: మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షనేత లేనే లేడని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. తన 3 నెలల పాలనే, లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తాను కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ప్రధానిని పెద్దన్న అనడంలో ఎలాంటి తప్పు లేదున్నారు. రాష్ట్రానికి కావాల్సిన విషయాలను తాను అందరి ముందు మైక్ లోనే చెప్పానని, కేసీఆర్ లాగ చెవిలో చెప్పడం తనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. కాళేశ్వరరావు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది.
ఆయన సీఎంగా ఉన్నప్పుడే మొత్తం డ్యామేజీ జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వమే రిపేర్ చేయాలని ఎన్ఎస్‌డీఏ నివేదిక ఇస్తే తప్పకుండా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అనే పార్టీనే లేదని, అలాంటప్పుడు ఆ పార్టీపై కామెంట్లు అనవసరమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లలో కుంభకోణం జరిగిందని, దొంగల్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు.
ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ చేసిన సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చేరడం గమనార్హం.
మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.
తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి.. బహుజన సమాజ్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కలసి పని చేయడంపై చర్చించారు. పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయంచుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్, మరికొద్దిమంది ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధ లేదని, మర్యాదపూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంజాయిషీ ఇచ్చుకున్నారు.
మంగళవారం నాడు ఉదయం "నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న వదంతులను నమ్మవద్దు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం" అంటూ కేసీఆర్‌తో తన భేటీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్‌తో ఆర్ఎస్పీ భేటీ కావడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా... వదంతుల్ని నమ్మవద్దు అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చినా లాభం లేకపోయింది. ఈ భేటీపైన రాజకీయ చర్చ జరిగిందనే ప్రచారం మాత్రం కొనసాగుతోంది.
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నానని అందుకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్ పోటీ చేయకుండా నేరుగా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని సమాచారం.
బోధన్ బీసీ హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణలో మరణించిన విద్యార్ధి హర్యాల వెంకట్ రామ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసి, ఆ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కవిత
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసాను. పార్టీలో కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యే ,మంత్రిని అయ్యాను. నా వ్యక్తిగత నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నా. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నా. చంద్ర బాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న.జైహొ బిసి సభలో టీడీపీ జాయిన్ అవుతున్న. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్న. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నాకు సహకారం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 151 గడప ఉన్న చిన్న పల్లెటూరు నుంచి ఎమ్మెల్యే అయ్యాను. ప్రజల కష్టుసుఖాలను చూసి ఈ స్థాయికి వచ్చా. నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే ఉన్నా. నన్ను 2019లోనే కర్నూలు ఎంపిగా పోటీ చేయాలని చెప్పినా వద్దని ఎమ్మెల్యే గా పోటీ చేశా. ఎంపిగా పోటీ చేయడం నాకు ఇష్తం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా. నా నియోజకవర్గం వదిలి వెళ్లాలని వైసీపీ చెప్పింది నాకు నచ్చలేదు. రెండు జిల్లాల్లో పోటీ చేయడానికి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న. మా సామాజిక వర్గంలో నేను పుట్టిన ఊరు కావడంతో గుంతకల్ నుంచి పోటీ చేస్తున్న. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని నేను ఏ రోజు అనుకోలేదు. నేను మాస్ లీడర్ ని నా అనుకున్నా నాకు న్యాయం జరగలేదు. 14 నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ న్యాయం జరిగిందో చూడండి. కర్నూలు జిల్లా పదవులు మొత్తాన్ని ఒక లీడర్స్ అంతా ఎస్సీలను,బోయాలను పదవుల నుంచి తప్పించారు.కర్నూలు జిల్లాలో ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు తప్పించలేదు.నాకు 2022 వరకు జీసస్, అల్లా యేసు అన్ని జగన్ . జగన్ ఒక విగ్రహలా మారారు మేము ఏమి చెప్పినా వినిపించడం లేదు. జగన్ అనే శిల్పానికి ఇద్దరు పూజారులు చెప్పేది వేదంలా ఉంది. సజ్జల రామ కృష్ణా రెడ్డి, దనునంజయ రెడ్డి ఇద్దరు కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. పూజారులు ఇద్దరు కలిసి భక్తులుగా ఉన్న మమ్మల్ని వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారు. నా పక్క నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ , నా పక్క నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందింది. నా నియోజకవర్గం పనులకు సంబంధించి బిల్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ధనుంజయ రెడ్డి వైసీపీ కోసం పని చేస్తున్నారు. నేను మళ్ళీ తిరిగి వైసీపీకి రాను నేను అజాత శత్రువును నాకు ఎవరితోనూ శతృత్వం లేదు.
విశాఖలో విజన్ విశాఖ సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు.
మావోయిస్టులతో సంబంధాలు నెరుపుతున్నారన్న కారణంతో అరెస్టైన మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఆయన్ని నిర్దోషిగా తేల్చింది బాంబే హైకోర్టు. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.
హైదరాబాద్‌లోని శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ బయోటెక్ కంపెనీలో ఈ దుర్ఘటన జరిగింది. భారీ అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kazipet Railway Station : కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగీలో మంటలు చెలరేగాయి. భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగీలో మంటలు చెలరేగాయి. భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
Nandyala Crime News: అనుమానం ఆమె ప్రాణాలను తీసింది. మూడు ముళ్ళు వేసిన చేతులతోనే వేటు వేశాడు. ఏడు అడుగులు నడిచి జీవితాంతం తోడుంటా అన్న భర్త ఆమె పాలిట కాల యముడు అయ్యాడు. పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై భార్యను నరికే చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తను గాయపరిచాడు.
నంద్యాల జిల్లా అవుకు పట్టణంలోని కోటవీధిలో రంగస్వామి కుమారి దంపతులు నివాసం ఉండేవారు. రంగస్వామి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు. కుమారుని పదేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగస్వామి తాగుడుకు బానిసై అనుమానంతో నిత్యం భార్యను వేధించేవాడు.
భర్త పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక భార్య కుమారి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిన కూడా భర్త వేధింపులు ఆగలేదు. దీంతో కుమారితోపాటు ఆమె చిన్నమ్మ సుబ్బలక్ష్మమ్మ అవుకు మండలం కేంద్రానికి చేరుకొని రంగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రంగస్వామి బస్టాండ్ సమీపంలో ఉన్న కుమారిపై పక్కనే ఉన్న టెంకాయలు కొట్టే కత్తితో విచక్షణరహితంగా నరికాడు.
రక్తపు మడుగులో ఉన్న కుమారిని స్థానికులు, ఆమె తరుపు బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలిస్తుండగా కుమారి మార్గమధ్యలోనే మృతి చెందింది. రంగస్వామిపై పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు.
రెండోరోజు తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానమంత్రి రానున్న వేళ సికింద్రాబాద్ మొత్తం కట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. పన్నెండు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి పూజలు చేసే సందర్భంలో ఇద్దరిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు.
9.45 రాజ్‌భవన్ రోడ్డు మార్గం
10- ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికింద్రాబాద్
10.10- దర్శనం, పూజ
10.20- బేగంపేట విమానాశ్రయం
10.25-బేగంపేట విమానాశ్రయం
10.50- సంగారెడ్డి హెలిప్యాడ్
11.-పటాన్‌చెరు
11.30- వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన
11.45-12.15- సంగారెడ్డిలో బహిరంగ సభ
12.55-బేగంపేట విమానాశ్రయం
1PM -బేగంపేట విమానాశ్రయం
14.45PM- భువనేశ్వర్ విమానాశ్రయం
ఎయిర్‌పోర్ట్ స్పెషల్ కార్గో కమిషనరేట్, ముంబై కస్టమ్స్ జోన్-III అధికారులు 447 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ వాషర్‌లో దాచి పెట్టి గుట్టుగా అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి ఈ మాదక ద్రవ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు.
చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి 9 లక్షల 44 వేల రెండు వందల రూపాయల నగదును పట్టుకున్నారు. దీనిపై విచారణ చేస్తన్నారు. ఈ నగదును ఆర్కే పేట నుంచి పుత్తూరుకు తరలిస్తున్నారు. కారులో ఉన్న సుధాకర్ చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు డాక్యుమెంట్స్ తీసుకురావాలని సూచించారు.
Background
Latest Telugu breaking News:తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి మరోసారి సభలో పాల్గొంటున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న జయహో బీసీ సమావేశంలో ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. మొదట పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరవడంపై స్పష్టత లేదు. ఇతర కార్యక్రమాలేమీ లేకపోవడంతో తాను కూడా జయహో బీసీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేస్తారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బీసీల భవిష్యత్ కోసం ఏం చేయబోతున్నామో ఈ సభలో ప్రకటించనున్నామని అచ్చన్న వివరించారు. అదే టైంలో వైసీపీ పాలనలో బీసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు పెట్టిన కేసులు కూడా ప్రస్తావిస్తామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు ఈ సభకు హాజరు అవుతున్నారని సభ తర్వాత వైసీపీ నేతల్లో గుబులు మొదలవుతుందని అభిప్రాయపడ్డారు.
సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. జనసేన కూడా ఈ డిక్లరేషన్ కమిటీలో భాగంగా ఉంది. ఇందులో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు, బీద రవిచంద్ర, అనగాని సత్యప్రసాద్, పంచుమర్తి అనూరాధ, బండారు సత్యనారాయణమూర్తి, రామారావు, గౌతు శిరీష, బీకే పార్థసారథి, కొనకళ్ల నారాయణ, గుంటుపల్లి నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, రవికుమార్, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాసయాదవ్, పీ మహేశ్, చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.
జగన్ రెడ్డి పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందన్నారు. జగన్ చేసిన మోసం నుండి కోలుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని.. స్పష్టం చేశారు. మంగళవారం నాగార్జున యూనివర్సిటి ఎదురుగా భారీ సభ ఏర్పాటు చేశారు. అందులో డిక్లరేషన్ ను ప్రకటించారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ ను రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.
బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీకులగణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటిస్తామన్నారు. జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీ డిక్లరేష్ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా టీడీపీ ప్రకటించనుంది. ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని డిక్లరేషన్‌లో పొందు పర్చాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి.. బహిరంగసభలు ఏర్పాటు చేసి.. డిక్లరేషన్లను ప్రకటించే అవకాశం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -