BJP Preparing To Break 40 MLAs: 


40 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు..!


ఢిల్లీలో భాజపా వర్సెస్ ఆప్ యుద్ధం కాస్త గట్టిగానే నడుస్తోంది. విమర్శలు చేయటంలో ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గటం లేదు. అవినీతి సర్కార్ అని ఆప్‌ను భాజపా విమర్శిస్తుంటే..కుట్ర అని ఆప్‌ ఎదురు దాడికి దిగుతోంది. ఈ క్రమంలోనే...తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను భాజపా తనవైపు లాక్కునేందుకు బేరమాడుతోందని ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడినట్టు విమర్శించింది. మొత్తం 40 మంది ఎమ్మెల్యేలకు రూ.800 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆశ చూపించిందని...ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంత బ్లాక్ మనీ...భాజపాకు ఎక్కడి నుంచి వస్తోందో అంటూ ప్రశ్నించారు. 






ఆపరేషన్ లోటస్ ఫెయిల్: ఆప్ 


"మా ఎమ్మెల్యేలను భాజపా సంప్రదిస్తోంది. నిన్నటి నుంచి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఈ పని చేస్తున్నారన్నది ఇంకా తేలలేదు. మా మీటింగ్‌కు ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు" అని ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే ఆరోపించారు. మరో ఎమ్మెల్యే అతీషి కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. "మా ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తున్నారు. కొందర్ని బెదిరిస్తున్నారు. డిప్యుటీ సీఎం కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడే కాదు. గతంలోనూ భాజపా ఇక్కడ ఆపరేషన్ లోటస్‌ను చేపట్టింది. అప్పుడు ఫెయిల్ అయ్యారు. ఎప్పుడూ ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటారు" అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో ఈ ఆరోపణలు రావటం సంచలనమైంది. అయితే...సమావేశం జరిగిన తరవాత ఆప్ స్పందించింది. భాజపా ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని...62 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది మీటింగ్‌కు వచ్చారని వెల్లడించింది. మిగతా ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఫోన్‌లో మాట్లాడారని స్పష్టం చేసింది. శుక్రవారం అసెంబ్లీలో స్పెషల్ సెషన్‌ నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. దీనిపైనే చర్చించేందుకు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు  చేశారు కేజ్రీవాల్. 


సిసోడియా కూడా..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ఈ స్కామ్‌లో మనీష్ సిసోడియా హస్తం కూడా ఉందన్న కారణంగా కేసు నమోదు చేసినట్టు CBI వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై FIR నమోదైంది. ఇటీవల సిసోడియా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్‌ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: Bilkis Bano Case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు, బిల్కిస్ బానో కేసు విచారణ